చేతబడి నెపంతో మహిళ ఇంటిపై దాడి

27 Dec, 2019 12:59 IST|Sakshi
చేతబడి అనుమానంతో పాపమ్మ ఇంటిని చుట్టిముట్టిన స్థానికులు

కాకినాడ క్రైం: నగరపాలక సంస్థ పరిధిలోని కొత్త కాకినాడలో కోనాడ పాపమ్మ తన ఇంట్లో ఎనిమిది నెలలుగా చేతబడి, క్షుద్రపూజలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమైందంటూ స్థానికులు గురువారం ఆమె ఇంటిపై దాడి చేశారు. ఆమె చేసే పూజల కారణంగా ఆ ప్రాంతంలో దాదాపు 10 మంది వరకు మరణించారని బాధిత కుటుంబాలవారు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నకిలే రాజేశ్వరి అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు పాపమ్మ ఇంటిపై దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న ఆమె అల్లుడు శ్రీను అడ్డుపడి పోలీసులకు ఫోన్‌ చేయడంతో టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పాపమ్మను పోలీసు స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. గ్రామ పెద్దలు, మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వస్తే సమస్యను పరిష్కరిస్తామని చెçప్పుకొచ్చారు. అయినా ప్రజలు పోలీసుల మాటను లెక్క చేయకుండా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో క్షుద్రపూజలకు ఉపయోగించే తాయెత్తులు, భయానకంగా ఉండే బొమ్మలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. 12 రోజుల క్రితం కోనాడ సూరిబాబు చేతబడి వల్లే చనిపోయాడని, ఇప్పుడు నకిలే రాజేశ్వరిని చంపేందుకు ప్రత్నిస్తుందని గ్రామస్తులు ఆరోపించారు.

క్షుద్రపూజలు కోసం ప్రశ్నిస్తే తనని చంపేస్తానని రెండు నెలల క్రితం బెదిరించిందని కోనాడ అప్పన్న తెలిపాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రాజేశ్వరి అత్త రమణమ్మ మాట్లాడుతూ వడ్డీ వ్యాపారం చేసే పాపమ్మ సకాలంలో డబ్బు చెల్లించని వారిపై చేతబడి ప్రయోగం చేస్తుందని ఆరోపించింది. తన కోడలు రాజేశ్వరిని తన ఇంటికి రప్పించుకొని క్షుద్రపూజలు చేసిందని, బుధవారం తన కోడలు పాపమ్మ ఇంటికి వెళ్లిపోతానని, అక్కడే తాను పూజలు చేసుకుంటానని చెప్పిందన్నారు. వెళ్లవద్దంటూ తాను చెప్పినా వినకుండా గురువారం ఉదయమే పాపమ్మ ఇంటికి వెళ్లిందని, అర్ధగంట తరువాత తిరిగి వచ్చి ఇంట్లో ఉరేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించిందని రమణమ్మ వివరించింది. ఇదే విధంగా 12 రోజుల క్రితం కోనాడ సూరిబాబు కూడా పాపమ్మ క్షుద్ర పూజలు వల్లే ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని, అతనికి ఎటువంటి చెడు అలవాట్లులేవని గ్రామస్తులు చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు గ్రామస్తులకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చివరకు గ్రామపెద్దల చొరవతో పోలీసులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. పాపమ్మ ఇంట్లో ఉన్న బొమ్మలు, ఇతర సామగ్రిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని, పాపమ్మతో ఎవరూ గొడవకు దిగవద్దని పోలీసులు చెప్పారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పాపమ్మను తక్షణం తమ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు పట్టించుకోకపోతే తామంతా ఏకమై ఆమెను ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ప్రజలు ఒప్పుకోకపోవడంతో పోలీసులు సాయంత్రం 5 గంటల తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిపోర్టు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోవడంతో ఆరు గంటల హైడ్రామాకు తెరపడింది. ప్రజలు మాత్రం పాపమ్మను తమ ప్రాంతంలోకి రానిచ్చేదిలేదంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే పాపమ్మను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మీ అంతు చూస్తాను, నెలకు ఇద్దరు, ముగ్గుర్ని చంపేస్తానంటూ పోలీసులు ఎదుటే గ్రామస్తులను బెదిరించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు