అత్యంత అమానుషంగా కొట్టి చంపారు

21 Jul, 2018 12:34 IST|Sakshi
ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

జైపూర్‌ : గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు హెచ్చరించినా అలాంటి దాడులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్‌లో ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నారనే నెపంతో ఇద్దరి యువకులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తప్పించుకున్నారు. గత అర్ధరాత్రి మృతుడు అక్భర్‌(28), అస్లామ్‌ అనే మరో వ్యక్తితో ఆవులను తీసుకెళ్తుండగా.. రామ్‌ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్వార్‌ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువకులు ఆవులను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని వెంబడించి మరీ అక్బర్‌ను పట్టుకోగా.. అస్లామ్‌ తప్పించుకున్నాడు.

అక్భర్‌పై మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి, మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆ రెండు ఆవులను సమీప గోశాలకు తరలించామని, ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశామన్నారు. అయితే మృతుడు హర్యానాకు చెందినవాడని, ఆవుల అక్రమ రవాణకు పాల్పడ్డారా లేదా అనే విషయం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్‌ గ్రామంలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్‌ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్‌ అహ్మద్‌ నవంబర్‌లో మృతిచెందాడు.

చదవండి: గోరక్షణ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మరిన్ని వార్తలు