విశాఖలో మరో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

24 Oct, 2019 12:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా విశాఖలో సాగుతున్న డ్రగ్స్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. విశాఖ టుటౌన్ పరిధిలో డాబాగార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్లో నరేంద్ర అలియాస్‌ విక్కీ విజయవాడ ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్కీ.. తమిళనాడులో ఆర్‌ఎల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మధురాయ్‌లో మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేశాడు. గతంలో విక్కీ డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్‌లో సైతం ఉన్నాడు.

ఆ సమయంలో డ్రగ్స్ సరఫరాదారుడు ఆంటోనీతో పరిచయం ఏర్పడి డ్రగ్స్ దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బెంగుళూరు, ముంబయి, గోవా నుంచి గంజాయి తీసుకుని విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిర్థారణకు వచ్చారు. అదుపులోకి తీసుకున్న​ మిగతా ముగ్గురిలో విక్కీ గర్ల్‌ ఫ్రెండ్‌ సీతా అలియాస్‌ సిరి, విశాఖకు చెందిన చింతలపూడి రాజు, వెన్నెల వెంకటరావు ఉన్నారు. నలుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితులను విశాఖ సీపీ రాజీవ్‌ కుమార్‌ మీనా ముందు హాజరు పరిచారు. 

మరిన్ని వార్తలు