పోలీసు కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!

8 Jun, 2020 13:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దివ్య హత్యలో పాల్గొన్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసి, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్టయిన సంగతి తెలిసిందే. (అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య)

కేసులో ఏ1 గా వసంత, ఏ2గా వసంత సోదరి మంజు, ఏ3గా వసంత తల్లి ధనలక్ష్మి, ఏ4గా వసంత మరిది సంజయ్ ఏ5గా గీత అలియాస్ కుమారి, ఏ6గా దివ్య పిన్ని కాంతవేణిలపై ఐపీసీ 302,343,324,326తో పాటు.. మహిళల అక్రమ రవాణచట్టం 201,294 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. వీరికి ఆదివారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి, మొదటి అదనపు జడ్జి ఎదుట హాజరుపర్చగా 19 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)

పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిన్న క్రితం ఉపాధి నిమిత్తం విశాఖకు వచ్చిన దివ్య.. వసంత ఇంటిలో ఆశ్రయం పొందింది. ప్రధాన నిందితురాలు వసంత, దివ్య పిన్ని కాంతివేణిల మధ్య పాత పరిచయం ఉండటంతో.. ఆ పరిచయంతోనే దివ్యను ఆమె పిన్ని కాంతవేణి.. వసంత ఇంటికి తీసుకొచ్చింది.విశాఖలో వసంత వ్యభిచార నిర్వహకురాలిగా ఉండగా, దివ్య పిన్ని కాంతవేణికి సైతం పడుపు వృత్తిలోనే వసంత పరిచయం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దివ్యను సైతం వసంత వ్యభిచార రొంపిలోకి దింపినట్లు సమాచారం.

గత ఏడాదిన్నరగా  దివ్య ద్వారా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించి.. వసంత కాసులు సంపాదిస్తునట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తనను వాడుకుని డబ్బులు సంపాదిస్తూ వసంత తనని మోసం చేస్తోందని దివ్య గ్రహించింది. ఇటీవల కాలంలో దివ్య, వసంతల మధ్య విబేధాలు పొడచూపడంతో దివ్య బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితురాలు వసంత.. కొందరితో కలిసి ఆమెకు గుండు కొట్టించి అతిక్రూరంగా ఐదు రోజుల పాటు హింసించి హత్య చేశారు. చివరకు అందమే శాపంగా మారి దివ్య తన జీవితాన్నే కోల్పోయింది.

మరిన్ని వార్తలు