మృత్యువులోనూ ఒకరికొకరు తోడుగా..

11 Feb, 2019 08:10 IST|Sakshi
సంఘటన స్థలంలో సుజాత మృతదేహం

తుని వద్ద అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

భార్యాభర్తల మృతి

మృతులు విశాఖ జిల్లా వాసులు

తూర్పుగోదావరి , తుని రూరల్‌:  వారికి పెళ్లై తొమ్మిది నెలలైంది. భార్య రెండు నెలల గర్భవతి. ఆనందంగా కాలం గడుపుతున్న ఆ కొత్తజంట మృత్యువు లోనూ ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు.  రూరల్‌ ఎస్సై కె. సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం దార్లపూడికి చెందిన భీముని మల్లేశ్వరరావు (35), సుజాత (25) దంపతులు. భీమేశ్వరరావు రాజ మహేంద్రవరంలో ఒకరి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల అస్వస్థతకు గురైన మల్లేశ్వరరావు యజమానిని సెలవు అడిగేందుకు మోటారు సైకిల్‌పై భార్యతో కలసి రాజమహేంద్ర వరం వచ్చాడు. వారు  ఆదివారం  స్వగ్రామం తిరిగి వెళుతుండగా తుని మండలం చేపూరు గ్రామ సమీపంలో  16వ నంబరు జాతీయ రహదారిపై మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి సెంటర్‌ డివైడర్‌ను ఢీకొంది. దాంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో సుజాత అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరరావును తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వారి బంధువులకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేశామని, సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

సెలవు పెట్టేందుకు వెళ్లి..
అనారోగ్యంతో ఉన్న మల్లేశ్వరరావు సెలవు పెట్టేందుకు వెళ్లివస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆయన సోదరుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఇంటివద్దే ఉన్నాడని, శనివారం భార్య సుజాతతో కలసి రాజమహేంద్రవరం వెళ్లాడని అన్నారు. తిరిగి వస్తుండగా మృత్యువు కబళించిందని బోరున విలపించాడు.

నా కూతుర్ని బస్సెక్కించమన్నా
తన అల్లుడు, కూతురు రాజమహేంద్రవరం సంతోషంగా వెళ్లారని, తిరుగు ప్రయాణంలో  తన కూతుర్ని బస్సెక్కించమన్నా వినలేదని సుజాత తండ్రి ఉప్పులూరి భాస్కరరావు ఆస్పత్రి వద్ద వాపోయాడు. 2018 మే నెలలో వివాహం చేశానన్నాడు. సుజాత రెండునెలల గర్భవతి కావడంతో బైక్‌పై వద్దని చెప్పానన్నారు. భాస్కరరావు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది.

>
మరిన్ని వార్తలు