పెడదారి పట్టిన ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు

29 May, 2018 09:06 IST|Sakshi

కెమెరాలు అద్దెకు తీసుకుని వంచన

రూ.12.3 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం

విశాఖకు చెందిన మోసగాడు అరెస్ట్‌

జయనగర : ఖరీదైన కెమెరాలను అద్దెకు తీసుకుని వాటిని ఓ ఆన్‌లైన్‌ సంస్థలో విక్రయించి విలాసవంతమైన జీవనం సాగిస్తున్న అంతరాష్ట్ర మోసగాడిని సోమవారం సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.12.3 లక్షల విలువ చేసే 2 కెమెరా, లెన్స్‌లను స్వాధీనం చేసుకున్నామని ఈశాన్యవిభాగం డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కళాకృష్ణస్వామి వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన లోహిత్‌ అనే వ్యక్తి రెంట్‌శ్రీ డాట్‌కామ్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. ఇతని వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణానికి చెందిన కార్తీక్‌ (28) అనే వ్యక్తి మార్చి 21న రూ. 2.76 లక్షల విలువైన డిజిటల్‌ కెమెరా, లెన్స్‌ అద్దెకు తీసుకున్నాడు.

అనంతరం వాటిని ఓ ఆన్‌లైన్‌ సంస్థలో సగం ధరకు విక్రయించి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమెదు చేసిన సంపిగేహళ్లి పోలీసులు నిందితుడిని గాలించి సోమవారం అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కార్తీక్‌ ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు కావడం గమనార్హం. ప్రతిభావంతుడైన కార్తీక్‌కు విలాసవంతమైన జీవనం కోసం విద్యకు స్వస్తి పలికి 2013లో విశాఖ పట్టణానికి చేరుకున్నాడు. స్టార్‌ హోట్లళ్లలో బసచేస్తూ  మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్, చెన్నై, ముంబాయి, కోల్‌కత్తా, ఢిల్లీ తదితర నగరాల్లో తిరుగుతూ ఖరీదైన వస్తువులను అద్దెకు తీసుకుని మరో నగరంలో విక్రయించి అక్కడి నుంచి ఉడాయించేవాడు.

కార్తీక్‌ తండ్రి నౌకాయానంలో అసిస్టెంట్‌ కమాండర్‌ కాగా తల్లి ఆం్ర«ధాబ్యాంక్‌లో మేనేజర్‌గా పదవి విరమణ పొందారు. కార్తీక్‌ బారిన పడిన 20 మందికి పైగా బాధితులకు వారు నగదు చెల్లించి కేసులను పరిష్కరించుకున్నారు. కార్తీక్‌ ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాకపోగా తన ప్రవృత్తిని కొనసాగించాడు. కార్తీక్‌ విశాఖపట్టణంలో ఓ వంచన కేసులో అరెస్టై జైలుకెళ్లి జామీనుపై విడుదలయ్యాడు. తల్లిదండ్రులు ఎన్ని సార్లు బుద్దిచెప్పినప్పటికి అతని మార్పు రాలేదని, పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడేవాడని డీసీపీ తెలిపారు. కార్తీక్‌పై హైదరాబాద్‌లోని హుమాయూన్‌నగర, బంజారాహిల్స్, ముంబాయిలోని గోరెగాంవ్‌ పోలీస్‌స్టేషన్లులో కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు