పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

7 Sep, 2019 08:21 IST|Sakshi

కేసును ఛేదించిన పోలీసులు

సుమారు 200 బైకుల అపహరణ

స్టీల్‌ప్లాంట్‌ స్టేషన్‌లో నిందితుడి విచారణ

సాక్షి, ఉక్కునగరం(గాజువాక): అతని వృత్తి మెకానిక్‌.. ప్రవృత్తి బైకుల చోరీ. పగలు వాహనాలను బాగు చేసే ఆయన రాత్రి వేళ బైకుల చోరీని అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 200 బైకులను అపహరించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర సౌత్‌ జోన్‌ పోలీసులు దర్యాప్తుముమ్మరం చేశారు. ఎట్టకేలకు కేసును ఛేదించారు. వందకు పైగా బైకులను రికవరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.

పరవాడలో బైక్‌ రిపేర్‌ షాపు నిర్వహిస్తూ..
పరవాడలో సుమారు 15, స్టీల్‌ప్లాంట్‌లో దాదాపు 40, ఇలా అనకాపల్లి, గాజవాక పరిధితో పాటు పలు చోట్ల మొత్తం సుమారు 200 బైకులు అపహరణకు గురయ్యాయి. పోలీసులకు సవాలుగా మారిన ఈ దొంగతనాల మూలం పరవాడలో ఉన్నట్టు తేలింది. నిందితుడు పరవాడలో బైక్‌ రిపేర్‌ షాపు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యకిగా గుర్తించారు. బయటకు మెకానిక్‌గా కనిపిస్తూ రాత్రుళ్లు బైకుల దొంగతనం చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్థారించారు.

 చోరీ బైక్‌ల విడిభాగాలను విక్రయిస్తూ..
చోరీ చేసిన బైకుల విడి భాగాలను తీసి స్పేర్‌పార్టులుగా అమ్మకం చేసేవాడు. ఆ వ్యాపారం విస్తరించడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన మెకానిక్‌లు కూడా ఈయన వద్ద నుంచే స్పేర్‌పార్టులు కొనుక్కునేవారు. ఇటీవల దొరికిన ఒక సాక్ష్యం ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా  తప్పించుకున్నాడు.

తప్పించుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు..
దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రకాశం, ఖమ్మం జిల్లాలకు రెండు బృందాలను పంపిం చారు. ఖమ్మంలోని అతని బంధువు ఇంట్లో ఉండగా పట్టుకున్నట్టు తెలిసింది. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇప్పటికే వందకు పైగా బైకులను పోలీసులు రికవరీ చేశారు.

 స్పేర్‌ పార్ట్‌లను రికవరీ చేస్తూ..
నిందితుడి నుంచి స్పేర్‌ పార్టులు కొనుగోలు చేసిన మెకానిక్‌లను కూడా అదుపులోకి తీసుకుని మరికొన్ని స్పేర్‌ పార్టుల రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర క్రైం ఏడీసీపీ సురేష్‌బాబు నేతృత్వంలో గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు క్రైం ఎస్‌లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బైకులను స్టీల్‌ప్లాంట్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఉంచారు. దొరికిన స్పేర్‌ పార్టులతో బిగించి  తిరిగి బైకులను సిద్ధం చేస్తున్నారు.

రికార్డు స్థాయిలో బైక్‌లు రికవరీ దిశగా..
జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 90 చోరీ బైకులను రికవరీ చేయగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. అతి త్వరలో పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు