అతి తెలివితో స్టీల్‌ప్లాంట్‌ సొత్తు చోరీ

21 Oct, 2019 08:58 IST|Sakshi
నిందితుడు నడుముకు చుట్టుకున్న రాగి తీగ

లోతైన దర్యాప్తుతో డొంక కదిలే అవకాశం

నడుముకు రాగి చుట్టుకుని సీఐఎస్‌ఎఫ్‌కు పట్టుబడిన వ్యక్తి  

అతని వెనుక ఎవరున్నారని  సాగుతున్న విచారణ

ఉక్కునగరం(గాజువాక): రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు స్టీల్‌ప్లాంట్‌ సొత్తు దొంగల పాలు అవుతూనే ఉంది. సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినా దొంగలు విభిన్న పద్ధతుల్లో సొత్తును తరలిస్తూనే ఉన్నారు. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంకు కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్ధతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు. వాటిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకోవడంతో ఏకంగా శరీరానికి చుట్టుకుని రాగిని తరలిస్తుండగా శుక్రవారం ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధుల నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేయగా ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకోవడం చూసి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు అప్పగించారు.

రాగి వైరు మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో ప్రాంతంలో కేబుల్‌ దాచి అక్కడ దాని నుంచి తీగను వేరు చేసి బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చోరీ ఎన్నాళ్ల నుంచి ఎంత మంది చేస్తున్నారు.. ఎంత మంది ఉన్నారు అన్నది సమగ్ర దర్యాప్తు చేస్తే వాటి మూలాలు బయటపడే అవకాశం ఉంది. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు దీనిని కేవలం ఒక దొంగతనంగా మాత్రం కాకుండా లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు