వి.కోట: మండలానికి చెందిన ఒక ప్రేమజంట కర్ణాటక రాష్ట్రం బేతమంగళం అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని గెస్తింపల్లికి చెందిన నీలకంఠ(32), చల్లపల్లికి చెందిన లలిత (28) ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పైగా వేరే పెళ్లి చేయడానికి నిర్ణయించడంతో ఇంట్లో నుంచి పారిపోయారు. వారికోసం ఇరు కుటుంబాల వారు వెతుకుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బేతమంగళం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉన్న విషయాన్ని గుర్తించిన పశువుల కాపరులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా వారు నీలకంఠ, లలితలుగా గుర్తించి, వి.కోట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి వారు పురుగుల మందు తాగి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజంట మృతితో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.