ఇంటర్నెట్‌తో వాయిస్‌ కాల్స్‌ మళ్లింపు

13 Jan, 2018 20:34 IST|Sakshi

ఎంబీఏ చదివిన యువకుడు అరెస్ట్‌ 

3 వీఓఐపీలు, 120 సిమ్‌కార్డులు స్వాధీనం 

సాక్షి, కడప అర్బన్‌ : సమాజంలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే ఇంటర్నెట్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ మళ్లిస్తూ ప్రభుత్వ బొక్కసానికి చిల్లుపెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ షేక్‌ మాసూంబాషా విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హాజీ గఫూర్‌సాబ్‌ వీధిలో ఉంటున్న హిమాయతుల్లా షరీఫ్‌ కుమారుడు షేక్‌ ముక్కపాలెం హఫీజుల్లా ఇంటర్నెట్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. సమాచారం అందుకున్న కడప వన్‌టౌన్‌ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా విలువజేసే మూడు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(వీఓఐపీ) వస్తువులు, 120 ఒడాఫోన్, రిలయన్స్‌ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీఓఐపీ ద్వారా కాల్స్‌ చేస్తే అది కంప్యూటర్‌ ద్వారా దేశంలోని అనధికారిక ఎక్స్‌ఛేంజిలకు వస్తుందని, అక్కడినుంచి సాధారణ కాల్స్‌ మాదిరి మారుతాయని ఆయన వివరించారు. ఆ కాల్స్‌ను నిందితుడు తనకు తెలిసిన సాంకేతికత, ఆధునిక పరికరాలతో సాధారణ కాల్స్‌ మాదిరి మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడని డీఎస్పీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర సెల్‌ఫోన్‌ సంస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడన్నారు. హఫీజుల్లాకుతోడు విజయవాడలో చిరంజీవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ కాల్స్‌ మళ్లించడంలో నైపుణ్యం పొందాడన్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్‌ ఎస్‌ఐలు యోగేంద్ర, మోహన్, ఎస్‌బీ ఎస్‌ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు