‘కారు’ పేరుతో రూ.70 లక్షల టోకరా

11 Mar, 2020 08:43 IST|Sakshi
సాకేత్‌ తల్వార్‌

బంజారాహిల్స్‌: కారుకు రుణం పేరిట ఫైనాన్స్‌ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని కారు డెలివరీ చేయకుండా పథకం ప్రకారం మోసగించిన ఘటనలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12లోని తల్వార్‌ వోల్వో షోరూం ఎండీ సాకేత్‌ తల్వార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెక్లెస్‌ రోడ్‌ బుద్ధ భవన్‌ వెనక ఉన్న విజయ్‌కాంత్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ గులాం అబ్రార్‌ను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 86లోని ఫేజ్‌–2లో నివసించే అబ్దుల్‌ యాకుబ్‌ గత ఏడాది జూన్‌ 27న కొత్త వోల్వో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నానని రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన ఫైనాన్స్‌ కంపెనీ అబ్దుల్‌ యాకుబ్‌కు రూ.70 లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు రూ.67.23 లక్షలు ఆర్టీజీఎస్‌ ద్వారా తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాకు జమచేసి మొదటి ఈఎంఐ కింద రూ.2.76 లక్షలు ఇచ్చింది. అబ్దుల్‌ యాకుబ్‌ ఈ కారును ఇవ్వడంలో సాకేత్‌ తల్వార్‌ తీవ్ర జాప్యం చేశారు.

ఇదేంటని ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ గులాం అబ్రార్‌ అలీ నాలుగైదుసార్లు కలిసి సాకేత్‌ తల్వార్‌ను ప్రశ్నించారు. తమ మేనేజర్‌ సొహైల్‌ను కలవాలంటూ ఒకసారి, ఇంకా మంజూరు కాలేదని మరోసారి సాకేత్‌ తప్పించుకోసాగాడు. ఇటీవల కారు కోసం ఆరా తీయగా తమ పేరు మీద కారు కేటాయించారని, దాన్ని మరొకరికి సాకేత్‌ విక్రయించారని తేలడంతో షాక్‌కు గురయ్యారు. మరింత ఆరా తీయగా ఇప్పటికే సాకేత్‌ తల్వార్‌ వంద మంది వరకు ఇలా కార్ల ముసుగులో మోసగించినట్లు తేలింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌ గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టి నిఘా వేసిన పోలీసులు కొండాపూర్‌లోని బొటానికా విల్లాస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాకేత్‌తో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డ అబ్దుల్‌ యాకుబ్, ఎంఏ సొహైల్‌లపై కూడా పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు