కుప్పంలో కీచకపర్వం..!

20 Jan, 2019 16:01 IST|Sakshi

సాక్షి, కుప్పం: టీడీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో లైంగిక వేధింపుల ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు సీఎం పీఏ మనోహర్‌కు సన్నిహితుడైన ఓ వీఆర్‌ఏ.. మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘన కలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లా కుప్పం తహశీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్‌ను.. వీఆర్‌ఏ ఆనంద్‌ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితురాలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోగా వేధింపులు మరింత ఎక్కువవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారు కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వీఆర్‌ఏ ఆనంద్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన సెల్‌ఫోన్‌ను దొంగతనం చేసి.. అందులోని తన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి మరొకరితో సంబంధం ఉన్నట్లు సృష్టించాడని వాపోయింది. తాను లొంగకపోవడంతో ఆ మార్ఫింగ్‌ ఫొటోలను వాట్సాప్‌ రెవెన్యూ గ్రూప్‌లలో, సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్‌.. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తిని విచారణ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దీనిపై విచారణ చేసిన కీర్తి.. శనివారం సాయంత్రం నివేదికను కలెక్టర్‌ ప్రద్యుమ్నకు అందజేశారు. దీని ఆధారంగా సదరు వీఆర్‌ఏను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్‌ఏ ఆనంద్‌కు ముఖ్యమంత్రి పీఏ మనోహర్‌ అండదండలున్నట్లు సమాచారం. గతంలో కూడా కుప్పం ఎండీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఆపరేటర్‌ను ఇలాగే వేధించినట్లు ఆరోపణలున్నాయి. కుప్పం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్థానిక టీడీపీ నాయకుల పరం చేయడమే ఆనంద్‌ పని అని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఒకేచోట తిష్ట వేసి అతని పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని అంటున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా