వీఆర్‌ఓ ఆత్మహత్య 

18 Sep, 2019 02:57 IST|Sakshi

పని ఒత్తిడి.. ఆపై చార్జ్‌మెమో జారీ 

తీవ్ర మనస్తాపంతో అఘాయిత్యం  

నల్లగొండ జిల్లాలో ఘటన  

నార్కట్‌పల్లి: పని ఒత్తిడి భరించలేక ఓ వీఆర్‌ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగ కృష్ణయ్య (46) కట్టంగూర్‌ మండలం పరడ గ్రామంలో వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాసు పుస్తకాలు అందడం లేదని, రైతుబంధు పథకానికి దూరమవుతున్నామని పలువురు రైతులు ఇటీవల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్‌.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ మహ్మద్‌ అలీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న కృష్ణయ్యతో పాటు మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీ చేశారు.

పని ఒత్తిడితో పాటు మెమో రావడంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య.. తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పని ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.  

బదిలీ చేయాలని విజ్ఞప్తి 
గ్రామంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, తనను బదిలీ చేయాలని కృష్ణయ్య.. తహసీల్దార్‌ను కోరగా, ఈ నెల 20వ తేదీ తర్వాత చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈలోపే అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా