మరో నకిలీ ఆర్టీఏ అధికారి అరెస్టు

30 Aug, 2019 14:00 IST|Sakshi
ఇంతేజార్‌గంజ్‌ స్టేషన్‌లో మాట్లాడుతున్న ఏసీపీ నర్సయ్య 

కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మరో నిందితుడి కోసం గాలింపు

సాక్షి, వరంగల్‌ : నగరంలో ఆర్టీఏ అధికారులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగులోని మరో సభ్యుడిని ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ నగరంలోని కాశిబుగ్గ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ వజీర్‌ అహ్మద్‌ అతని స్నేహితులు యాసిన్, సాధిక్‌ గ్యాంగుగా ఏర్పడి కొద్ది కాలం నుంచి ఆర్టీఏ అధికారుల పేరుతో నగర శివారు ప్రాంతాల్లో వాహనదారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 21న ఏనుమాముల మార్కెట్‌ సమీపంలోని ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌ను ఆర్‌సీబుక్కు, ఇతర పత్రాలు ఏవంటూ బెదిరించి రూ.8వేలు వసూలు చేయగా ఫిర్యాదులు అందాయన్నారు.

ఈ గ్యాంగుపై దృష్టి సారించగా 22న ముఠాలో ఒక సభ్యుడైన సాదిక్‌ను అదుపులోకి తీసుకుని వద్ద ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన సభ్యుల కోసం ఎస్సై అశోక్‌ నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం కాశిబుగ్గలో తనిఖీ చేస్తుండగా నిందితుడు వజీర్‌ అహ్మద్‌ చిక్కాడని, అతడి వద్ద నుంచి రూ.5200 నగదు, ఇథియోస్‌ కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నిందితడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గ్యాంగులోని ఇద్దరు నిందుతులను అరెస్టు చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్, హెడ్‌కానిస్టేబుల్‌ కె.రవీందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పి.సంతోష్, ఎన్‌.రాంరెడ్డి. ఎండీ.అలీ, ఎన్‌.నరేష్‌లను ఈ సందర్భంగా ఎసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు