సంజయ్‌కుమార్‌పై సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

2 Jun, 2020 13:40 IST|Sakshi

మిగతా వారు మత్తులోకి వెళ్లాక బావిలో తోసేసిన నిందితుడు

ఆహారంలో నిద్రమాత్రలు కలిపాక సైకిల్‌పై షికారు

అర్ధరాత్రి వచ్చి పని చక్కబెట్టిన వైనం

సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో వెలుగుచూసిన నిజాలు

సంజయ్‌కుమార్‌ యాదవ్‌పై కొనసాగుతున్న విచారణ

గీసుకొండ (పరకాల): వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ పోలీసుల విచారణలో విస్మయపరిచే విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను ఆరు రోజులపాటు విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆది, సోమవారాల్లో ఘటనాస్థలం, గోదాముల ప్రాంతంతోపాటు గ్రేటర్‌ వరంగల్‌ 4వ డివిజన్‌ ఆదర్శనగర్‌లో అతను అద్దెకు ఉంటున్న ప్రాంతం, నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్‌ షాపు ప్రాంతాల్లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్లు సమాచారం. ఈ మేరకు విస్మయపరిచే నిజాలు వెల్లడవుతున్నాయని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.  (రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?)

ఇలా చేశాడు..!
సంజయ్‌కుమార్‌ తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కరిని గోనె సంచిలో బావి వద్దకు తీసుకెళ్లి ప్రాణం ఉండగానే అందులో పడేసినట్లు పోలీసులు ఇటీవల వెల్లడించారు. అయితే ఇంకా మరికొన్ని అంశాలు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సందర్భంగా తెలుస్తున్నట్లు సమాచారం. మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాతూన్‌ మూడేళ్ల కుమారుడు ‘బబ్లూ’ను బతికి ఉండగానే గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. బబ్లూ ఊపిరాడక చనిపోయాడని, అతనికి ఎక్కువ మోతాదులో విషం ఎక్కలేదని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని పోస్టు మార్టంలో గుర్తించినట్లు వైద్యులు వెల్లడించిన విషయం విదితమే. మే 21న రాత్రి గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో 9 మందికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు.. బయటకు వచ్చి కొంతదూరం కాలినడకన అక్కడక్కడా తిరిగాడని, ఆ తర్వాత తన జాడ పోలీసు జాగిలాలు గుర్తించకుండా పలుచోట్ల కాళ్లు కడుకున్నాడని, సైకిల్‌పై వరంగల్‌ చౌరస్తా, ఇంతెజార్‌గంజ్‌ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం సంజయ్‌ అర్ధరాత్రి గోదాంకు వచ్చే ముందు అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నిషాకు ఫోన్‌ చేయగా ఆమె మత్తులోనే హా.. అని తప్ప మరో మాట మాట్లాడలేదని తెలుస్తోంది. గోదాం వద్దకు తిరిగివచ్చాక బబ్లూ ఏడ్చుకుంటూ కనిపించడంతో అతడిని గొంతు నులిమి హత్య చేసి బావిలో వేశాడని తెలిసింది.  ఇప్పటికే పోలీసులు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోగా.. మిగతావి ఎక్కడ ఉన్నాయనే విషయంలో సంజయ్‌ను తమదైన శైలిలో విచారిస్తున్నారు. దీంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా