ఓరుగల్లు న్యాయ దిగ్గజం ప్రసాద్‌ కన్నుమూత

26 Oct, 2019 11:22 IST|Sakshi

యాభై ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌

విద్యార్థి సంఘం ఎన్నికల్లో కొణిజేటి రోశయ్యపై గెలుపు

సంతాపం తెలిపిన  న్యాయమూర్తులు, న్యాయవాదులు

సాక్షి, వరంగల్‌ : ఓరుగల్లు న్యాయదిగ్గజం, తొలి తరం న్యాయవాది కిలారు శ్రీరామ గోవింద ప్రసాద్‌(కేఎస్‌ఆర్‌జీ.ప్రసాద్‌) శుక్రవారం కన్నుమూశారు. హన్మకొండలోని అడ్వకేట్స్‌ కాలనీలో ఉన్న తన స్వగృహంలో తెల్లవారుజామున 2.30గంటలకు ఆయన మృతి చెందారని కుటుంబీకులు వెల్లడించారు. 50 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన ప్రసాద్‌ మరణం జిల్లా కోర్టు న్యాయవాదులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1925లో నాటి నిజాం సంస్థానం పరిధిలోని నేటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నందిగామలో ప్రసాద్‌ జన్మించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అధిష్టానం అదేశాల మేరకు మహబూబాబాద్‌లో స్థిరపడ్డారు. వామపక్ష విద్యార్థి సంఘ నేతగా డిగ్రీ చదువుతున్న సమయంలో గుంటూరు హిందు కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా మాజీ గవర్నర్‌ కోణిజేటి రోశయ్యపై విజయం సాధించాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా పొంది 1955లో న్యాయవాదిగా నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో పేరు నమోదు చేసుకున్నారు. నాటి నుండి సివిల్‌ కేసులు వాదించడంలో, యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వడంలో ఎంతో నైపుణ్యం సాధించాడు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, రచయితగా బహుముఖ రంగాల్లో ప్రజ్ఞాశాలిగా ప్రసాద్‌కు పేరు ఉంది.

స్టాండింగ్‌ కౌన్సిల్‌లో.. అధ్యాపకుడిగా
కాజీపేటలోని నిట్‌తోపాటు వివిధ బ్యాంకులు,, విద్యాసంస్థలకు ప్రసాద్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులుగా పని చేశారు. అనేక సెమినార్లు నిర్వహించి భూసంస్కరణలు, మానవహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, ప్రాథమిక హక్కులు అంశాలలో తనదైన శైలిలో పత్రాలు సమర్పించారు. కేయూ, ఎస్డీఎల్‌సీఈ, న్యాయ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కాగా, మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం ఉపా«ధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో పాటు సీనియర్‌ న్యాయవాది సహోదర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, అరవింద్, రాంగోపాల్‌రావు, యూసుఫుద్దీన్, వీరస్వామి, వెంకటేశ్వర్‌రావు, జితేందర్‌రావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజమౌళి, ఆర్‌.సదానందం, ఎన్‌.సురేందర్, కిషోర్‌కుమార్, రేవతిదేవి, ఆండాలు, రిటైర్డ్‌ జిల్లా జడ్జి రాజన్న తదితరులు ప్రసాద్‌ వద్ద శిష్యరికం చేశారు.

అప్పట్లోనే కులాంతర వివాహం చేసుకుని ప్రసాద్‌ అదర్శంగా నిలవగా, ఆయన జీవిత భాగస్వామి సూర్యముఖి పింగిళి మహిళా కళాశాలలో లెక్చరర్‌గా రిటైర్డ్‌ అయ్యారు. వీరి కుమారుడు డాక్టర్‌ సతీష్‌చందర్‌ కాగా, కుమార్తెలు సుధ, స్వర్ణలత అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా రిటైర్డ్‌ అయ్యారు. కాగా, కేఎస్‌ఆర్‌జీ.ప్రసాద్‌ మృతి విషయం తెలిసి జిల్లా కోర్టు న్యాయవాదుల ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే, మొదటి అదనపు జిల్లా కోర్టు హాల్‌లో జడ్జి జయకుమార్‌ అధ్యక్షతన, బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో అధ్యక్షుడు లెక్కల జలేందర్‌రెడ్డి అధ్యక్షతన సంతాపసభ నిర్వహించారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ సంజీవరావు, జయకర్, జనార్దన్, సత్యనారాయణ, వేణుగోపాల్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

బోయినిపల్లి వినోద్‌కుమార్‌ సంతాపం
హన్మకొండ: సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ఆర్‌జీ.ప్రసాద్‌ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యతో కలిసి జైలు జీవితం అనుభవించిన ప్రసాద్‌.. స్వాతంత్య్ర సమరయోదుడైనా పెన్షన్‌ తీసుకోలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు