హోలీ.. వికృత కేళి!

4 Mar, 2018 09:49 IST|Sakshi

లోకల్‌ రైళ్లపై వాటర్‌ బెలూన్లతో దాడి

నిందితులను గుర్తించిన పోలీసులు

త్వరలో పట్టుకుంటామని వెల్లడి

హోలీ ఆడుతూ గాయాలపాలైన యువకులు

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో హోలీ పండుగ వికృత చేష్టలకు తెరతీసింది. దీంతో కొంత మంది గాయాలపాలయ్యారు. కొందరు ఆకతాయిలు వెళ్తున్న రైళ్లపై రంగు నింపిన వాటర్‌ బెలూన్లును విసురుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. ములుండ్‌ సమీపంలోని లోకల్‌ రైలు మొదటి తరగతి మహిళల కోచ్‌ వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వారిపై వాటర్‌ బెలూన్లను విసిరారు. ట్రాక్‌ పక్కన నివసిస్తున్న కొందరు గ్రూప్‌లుగా ఏర్పడి ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు కుర్లా, సియోన్, బాంద్రాల్లోనూ చోటుచేసుకున్నాయని తెలిపారు. సాధారణ దుస్తులు ధరించి మఫ్టిలో తాము డ్యూటీ చేశామని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది తెలిపారు. ములుండ్‌ ప్రాంతాన్నే కొందరు టార్గెట్‌గా చేసుకొని ఈ పనికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులను తాము గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  

పలువురికి గాయాలు..
హోలీ ఆడుతున్న ఆనందంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న రామ్‌ దుబే (28) హోలీ ఆడుతూ గేట్‌ మధ్యలో వేలు ఇర్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సియోన్‌ ఆస్పత్రికి తరలించారు. వడాలకు చెందిన మరో వ్యక్తి వాటర్, రంగులు నింపిన బెలూన్లను కుక్కపై విసరడంతో అది అతనిపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటివి 17 కేసులు నమోదయ్యాయని ఆ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 17 కేసుల్లో 12 కంటికి సంబంధించినవని తెలిపారు. మరోవైపు సియోన్‌ ఆస్పత్రిలో కూడా 20, నాయర్‌ ఆస్పత్రిలో 2 కేసులు నమోదైయ్యాయని పేర్కొన్నారు.  

హోలీ నింపిన విషాదం
పుణే: హోలీ పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. హోలీ ఆడుతూ బస్సు నుంచి కింద పడి సతీశ్‌ కాంబ్లె (14) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, కాంబ్లె కుటుంబం పుణేలోని లక్ష్మీ నారాయణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మోజే హై స్కూల్‌లో సతీశ్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్‌ అయిపోయాక బస్సులో ఇంటికి వస్తున్నాడు. ఆ క్రమంలో బస్సులో స్నేహితులతోపాటు సతీశ్‌ హోలీ ఆడుతున్నాడు. అందులో కొంత మంది సతీశ్‌పై వాటర్‌ బెలూన్లు విసిరారు. వాటిని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు నుంచి కింద పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు