ఆ అమ్మాయే మసాజ్‌ చేస్తానంది : ‘గజల్‌’ శ్రీనివాస్‌

2 Jan, 2018 13:33 IST|Sakshi
పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతున్న గజల్‌ శ్రీనివాస్‌(లేటెస్ట్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : మహిళా రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన ‘గజల్‌’ శ్రీనివాస్‌ అలియాస్‌ కేసిరాజు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్‌ గాయాలతో బాధపడుతున్న తనకు ఆ అమ్మాయే ఇష్టపూర్తిగా మసాజ్‌ చేసిందని, అయితే ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కే చెందిన ఆలయవాణి వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగళవారం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆత్మసాక్షిగా చెబుతున్నాను : ‘‘ఆత్మసాక్షిగా చెబుతున్నాను. నేను మహిళల్ని గౌరవిస్తాను. ఆ అమ్మాయి మా సంస్థలోనే పనిచేస్తుంది. నామీద ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడంలేదు. కొద్ది రోజుల కిందట నాకు యాక్సిడెంట్‌ అయింది. అందువల్ల బాడీలో కొన్నిచోట్ల కాల్షియమ్‌ పేరుకుపోయింది. దాన్ని నియంత్రించడానికి రెగ్యులర్‌గా మసాజ్‌ చేయించుకుంటాను. ఒకరోజు ఫిజిషియన్‌ రాకపోయేసరికి ఆ అమ్మాయే ముందుకొచ్చి.. మసాజ్‌ చేస్తానంది. నేను వద్దన్నా వినకుండా మసాజ్‌ చేసింది. నాకు ఆమెపట్ల ఎలాంటి బ్యాడ్‌ ఇంటెన్ష్‌ లేదు..’ అని గజల్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.

పక్కాగా ఆధారాలు.. అందుకే అరెస్ట్‌ : సాధారణ ఫిర్యాదులకు భిన్నంగా నేరానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించడంతోనే గజల్‌ శ్రీనివాస్‌కు నోటీసులు లాంటివి ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ‘బాధితురాలు బయటి ఊరి నుంచి వచ్చి ఇక్కడ(హైదరాబాద్‌లో) ఓ హాస్టల్‌లో ఉంటూ గజల్‌ శ్రీనివాస్‌కు చెందిన రేడియోలో పనిచేస్తోంది. తాను లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ ఫిర్యాదు ఇవ్వడమేకాక.. సంబంధిత వీడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు అందించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 509ను అనుసరించి కేసులు నమోదుచేశామని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం గజల్‌ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.  (చదవండి : లైంగిక వేధింపులు ; ‘గజల్‌’ శ్రీనివాస్‌ అరెస్ట్‌)

మరిన్ని వార్తలు