ఆర్టీసీ బస్సు చోరీ ఘటనలో 9 మంది అరెస్ట్‌

27 Apr, 2019 16:14 IST|Sakshi
చోరీకి గురైన ఆర్టీసీ బస్సు..అంతర్‌ చిత్రంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌

హైదరాబాద్‌: తెలంగాణా ఆర్టీసీ బస్సు చోరీ ఘటనపై ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌ శనివారం స్పందించారు. హైదరాబాద్‌లో డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ..అఫ్జల్‌ గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పోలీసులు నాందేడ్‌లో పట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్‌ 24న రాత్రి 12 గంటల 3 నిమిషాలకు బస్సు చోరీ జరిగిందన్నారు. సీబీఎస్‌ నుంచి తూప్రాన్‌ మీదుగా బస్సును నాందేడ్‌ తీసుకెళ్లారని, నాందేడ్‌కు 10 కిలోమీటర్ల దూరంలో బస్సును నిలిపివేసి బస్సు భాగాలని విడగొట్టారని వివరించారు.

బస్సు చోరీ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 9 మంది నిందితుల్లో ఏ1, ఏ2లు ఇద్దరూ అన్నదమ్ములు.. వీరు హైదరాబాద్‌లో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగానే బస్సును గుర్తించామని, లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకుని బస్సును షెడ్డుకు తరలించారని పేర్కొన్నారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం రూ.60 వేలు నిందితులు తీసుకున్నారు.. వారి నుంచి రూ.19 వేల 500 తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు