యువతిని బలిగొన్న బ్యానర్‌

13 Sep, 2019 07:52 IST|Sakshi
శుభశ్రీ (ఫైల్‌)

పళ్లికరణైలో విషాదం

సాక్షి, చెన్నై: పల్లావరం సమీపంలోని ఓ బ్యానర్‌ స్కూటర్‌పై వెళ్తున్న యువతిని బలికొంది. వివాహ ఆహ్వానం పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్‌ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆ యువతి కింద పడింది. అదే సమయంలో వెనుక వైపున వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. గురువారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పల్లావరం రెడియల్‌ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్‌ మీద వెళుతోంది. ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్‌ రూపంలో మృత్యువు కబళించింది. అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు ఇచ్చినా, వాటిని భేఖాతరు చేయడంతో ఓ నిండు ప్రాణం బలి అయింది.

వివాహ ఆహ్వానం పేరిట మాజీ కౌన్సిలర్‌ ఒకరి కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ నేలకొరిగింది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో అదుపు తప్పింది. స్కూటర్‌ నుంచి కింద పడ్డ శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతిచెందింది. సమాచారంతో పళికరణై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. ఆ బ్యానర్‌ను ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా ఏర్పాటు చేసి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ బ్యానర్‌ రూపంలో శుభశ్రీ మరణించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఈ మార్గంలో ఇష్టానుసారంగా రాజకీయ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


మరిన్ని వార్తలు