దొంగలకు కుక్కపిల్ల ఝలక్!

10 Nov, 2017 17:08 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఎనిమిది నెలల ఓ కుక్కపిల్ల దొంగలకు ముచ్చెమటలు పట్టించింది. యజమాని ఇంట్లో జరిగిన చోరీలో దొంగలు ల్యాప్‌టాప్, ఐపాడ్ సహా పప్పీని ఎత్తుకెళ్లగా మూడు రోజుల తర్వాత దొంగల కళ్లుగప్పి తప్పించుకుంది. తన ఫ్రెండ్ పప్పీ లేదని బెంగపెట్టుకున్న నాలుగేళ్ల చిన్నారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబం గత సోమవారం బయటకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. ఆభరణాలు, ల్యాప్‌టాప్‌, ఐపాడ్, లాబ్రడార్‌ జాతికి చెందిన ఓ కుక్కపిల్ల (సాశా), ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇంటికి రాగానే బాధిత కుటుంబానికి విషయం అర్థమైంది. ఐతే తనఫ్రెండ్‌ సాశా(కుక్కపిల్ల) ను దొంగలు తీసుకెళ్లారని నాలుగేళ్ల ఓనర్ కూతురు తిండి మానేసి బెంగపెట్టుకుంది. దొంగల్ని పట్టుకుని తమ కుక్కపిల్లను ఇప్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు ఓ ట్వీట్ చేశారు.

8నెలల పప్పీ అనే కుక్కపిల్ల కిడ్నాప్ అయిందని, డిటెక్టివ్స్ దర్యాప్తు చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కుక్కపిల్ల మూడ్రోజుల తర్వాత ఇంటికి వచ్చేసింది. పప్పీ కారణంగా దొరికిపోతామని భయాందోళనకు గురైన దొంగలు ఆ కుక్కపిల్లను ఇంటిదగ్గర వదివెళ్లుంటారని పోలీసులు భావిస్తున్నారు. 'దొంగల నిజాయితీ ఎవడికి కావాలి.. మా పప్పీనే దొంగల కళ్లుగప్పి వచ్చేసింది. దొంగల్ని అరెస్ట్‌చేసి ఇతర విలువైన వస్తువులు తమకు వచ్చేలా చూడాలని' బాధిత కుటుంబం మరోసారి పోలీసులను కోరింది.

మరిన్ని వార్తలు