బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’

14 Jul, 2020 03:50 IST|Sakshi

సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యుల డిమాండ్‌

రాష్ట్రంలో గూండారాజ్యం: నడ్డా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హెమ్తాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్‌ రే సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్త్‌ దినాజ్‌పూర్‌ జిల్లాలోని స్వగ్రామం బిందాల్‌లో తన ఇంటి సమీపంలోని ఓ దుకాణం పైకప్పునకు ఉరేసుకుని కనిపించారు. అయితే, ఇది ఆత్మహత్య కాదు హత్యేనని దేబేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులే ఆయనను హత్య చేశారని మండిపడుతున్నారు. దేబేంద్రనాథ్‌ చొక్కా జేబులో సూసైట్‌ నోట్‌ దొరికిందని, తన ఆత్మహత్యకు ఇద్దరు వ్యక్తులు కారకులంటూ అందులో ఆయన రాశారని పోలీసులు చెప్పారు.

దేబేంద్రనాథ్‌ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా హెమ్తాబాద్‌ రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి గెలిచారు. అనంతరం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. దేబేంద్రనాథ్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే మృతితో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులుకుంది.  పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండారాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు