బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోన్న హత్యలు

11 Oct, 2019 14:41 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వస్తున్న వరుస హత్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆరెస్సెస్ కార్యకర్త అయిన గోపాల్‌, ఎనిమిది నెలల గర్భవతి అయిన అతని భార్య, ఆరేళ్ల కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను మర్చిపోకముందే.. మరో హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి  వెళ్లిపోయిన ఓ పూజారి గురువారం నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇతను కూడా బీజేపీ కార్యకర్త కావడం గమనార్హం.
(చదవండి: తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య)

వివరాలు.. నాదియా జిల్లాకు చెందిన సుప్రియో బెనర్జీ(42) అనే పూజారి ఈ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు గురువారం  ఓ నది ఒడ్డున బెనర్జీ మృతదేహం కనిపించింది. అయితే డబ్బు కోసమే బెనర్జీని హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్లినప్పుడు బెనర్జీ కొంత డబ్బు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. అయితే బెనర్జీ హత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. బీజేపీ కార్యకర్త కావడం మూలానే బెనర్జీని చంపేశారని ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్‌ సర్కార్‌ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో మరో బీజేపీ నాయకుడు బాబుల్‌ సుప్రియో.. ‘సుప్రియో బెనర్జీ బీజేపీ కార్యకర్త కావడం వల్లే అతడిని దారుణంగా చంపేశారు. గడిచిన నాలుగు రోజుల్లో 8 మందిని హత్య చేశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఓ జోక్‌గా మారింది. బెంగాల్‌ ప్రజలు వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారు ప్రతీకారం తీర్చుకుంటారు. లిబరల్స్‌గా చెప్పుకునే మేథావులు ఈ హత్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు. స్పందించడం లేదేందుకు’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు