పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి

17 Oct, 2019 19:48 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాది దాడిలో గాయపడి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవ్వూరి తేజస్వినిని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద‍్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా పోడూరు మండలం కవిటంకు చెందిన  డిగ్రీ విద్యార్థిని తేజస్వినిని  పథకం ప్రకారమే మేడపాటి సుధాకర్‌రెడ్డి హతమార్చేందుకు  కత్తితో దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తేజస్వినిని ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తుండటంతో ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో  తేజస్వినిని ఇబ్బంది పెట్టనని సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటనతో  తేజస్వినిపై  కక్ష పెంచుకున‍్న సుధాకర్‌రెడ్డి ఆమెను హతమార్చేందుకు పక‍్కా స్కెచ్‌ వేశాడు. సమయం కోసం మాటువేసి కత్తితో ఆమెపై దాడి చేశాడు.

తేజస్విని పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పెద్దల సమక్షంలో రాజీ జరిగినప్పట్నుంచీ కళాశాలకు వెళ్లేటపుడు రోజూ ఆమె మేనమామ శ్రీనివాసరెడ్డి  బస్సు ఎక్కించి వస్తున్నారు. అయితే బుధవారం పని ఉండి మేనమామ ఆమె వెంట రాలేదు. తేజస్విని ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన సుధాకర్‌రెడ్డి వెస్పాపై కత్తులు ఉన్న సంచి తీసుకుని ఆమెను వెంబడించాడు.  కత్తితో దాడికి తెగబడ్డాడు. సమీపంలోని ఇంటి పెరట్లోకి తేజస్విని పరుగెత్తడంతో అక్కడే ఉన్న ఆ ఇంటి యజమానితో పాటు మరొకరు సుధాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. 

ఓవైపు వారిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు  తేజస్వినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి తరువాత సుధాకర్‌రెడ్డి నోటి నుంచి నురుగ రావడంతో దాడి చేయడానికి ముందే అతడు పురుగుమందు తాగినట్లు తెలుసత​ఓంది.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు  చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తేజస్విని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సుధాకర్‌రెడ్డికి గతంలోనే వివాహం అయింది. అయినా తేజస్వినిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు