‘ఉత్తరాన’ నేరాలు... ‘పశ్చిమాన’ నేరగాళ్లు!

19 Nov, 2019 09:59 IST|Sakshi

వెస్ట్‌జోన్‌లో చిక్కుతున్న వాంటెడ్‌ నిందితులు

అత్యధికం ఉగ్రవాద సంబంధిత కేసుల్లోనే

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వెస్ట్‌జోన్‌ 

డాక్టర్‌ అష్వఖ్‌ అరెస్టుతో మరోసారి తెరపైకి

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరాదిన జరిగిన అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారు నగరంలోని పశ్చిమ మండల పరిధిలో తలదాచుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న ఆర్మీ మాజీ డాక్టర్‌ అష్వఖ్‌ ఆలం అరెస్టు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. వీఐపీ జోన్‌గా పరిగణించే వెస్ట్‌జోన్‌ అనేక సంచలనాత్మక నేరాలకు సైతం కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంది. విజయవాడకు చెందిన చలసాని పండు, అనంతపురం జిల్లాకు చెందిన మద్దెలచెర్వు సూరి, పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సమీప బంధువు హత్య, ఇందుకు నిదర్శనాలు. కేవలం ఈ తరహా సంచలనాలు మాత్రమే కాకుండా ఈ జోన్‌ ఉగ్రవాదులకు సైతం డెన్‌గా మారిపోయింది.  

కలిసివస్తున్న అంశాలెన్నో... 
నగర కమిషనరేట్‌ పరిధిలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలానికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా నగర వ్యాప్తంగా ఉన్న వీఐపీల్లో 80 శాతం ఈ జోన్‌ పరిధిలోనే ఉంటారు. మరోపక్క నగరంలో ఉన్న లైసెన్డŠస్‌ ఆయుధాల్లో మూడొంతులు ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ వీఐపీ జోన్‌లో ముష్కరులు తలదాచుకునేందుకు ఉపకరించే అంశాలూ అనేకం ఉన్నాయి. ఓ పక్క ఖరీదైన ప్రాంతాలతో పాటు మధ్య తరగతి ప్రజలు నివసించే కాలనీలు, సామాన్యులు ఉండే బస్తీలు సైతం ఈ మండలంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ తరహాకు చెందిన వారైనా ఇక్కడ తేలిగ్గా ఆశ్రయం పొందే అవకాశం ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకున్న ముష్కరులు ఈ మండలాన్ని తమకు అనుకూలంగా వాడుతున్నారు.  

విద్య, ఉద్యోగ కారణాలు చూపిస్తూ... 
పశ్చిమ మండల పరిధిలో పలు విద్యాకేంద్రాలు సైతం ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, పలు వ్యాపార, ఉద్యోగ సంస్థలు ఉన్నాయి. వీటికితోడు అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్‌ తదితర ప్రాంతాలు విద్యా సంస్థలకు పెట్టింది పేరు. అకడమిక్‌ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ బోధించే పలు సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన మాదాపూర్‌ ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్న సైబరాబాద్‌ సైతం దీనికి సరిహద్దుగా ఉండటం కూడా వారికి కలిసి వస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ముష్కరులు ఆయా సంస్థల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పుకుని ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. దీనికితోడు వెస్ట్‌జోన్‌ పరిధిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలస వచ్చి నివసిస్తుండటంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలిగ్గా మారిపోయింది.  

పరారీకి మార్గాలు ఎన్నో... 
సిటీలో ఆశ్రయం పొందిన ముష్కరులు ఏదైనా ఘాతుకానికి పాల్పడినా, తమను ఎవరైనా అనుమానిస్తున్నారని, గమనిస్తున్నారని గుర్తించినా, పట్టుకోవడానికి వస్తున్నట్లు తెలిసినా తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువ. ఒక్క జల మార్గం మినహా మిగిలిన అన్ని రకాల రవాణా సౌకర్యాలు, అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటాయి. వీటికితోడు వివిధ పనులపై నిత్యం నగరానికి వచ్చిపోయే ఇతర ప్రాంత, రాష్ట్రాల వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ముష్కరులు ఎవరి దృష్టిలోనూ పడకుండా తప్పించుకుని పారిపోయేందుకు అవకాశం ఉంది. వీటన్నింటికీ తోడు ఏ భాషలో మాట్లాడినా ప్రత్యేకంగా చూసే అవకాశం లేకపోవడం కూడా వారికి కలిసి వస్తోంది. కేవలం కొన్ని గంటల్లో రాష్ట్ర, నిమిషాల్లో జిల్లా సరిహద్దులను దాటే సౌలభ్యం ఉండటం కూడా వారికి షెల్టర్‌ జోన్‌లా ఉపయోగపడుతోంది.  

వెస్ట్‌జోన్‌కు ‘మచ్చ’ తునకలు ఇవీ..

  • 1992లో టోలిచౌకీలోని బృందావన్‌కాలనీలో తలదాచుకున్న ముజీబ్‌ మాడ్యుల్‌ను పట్టుకునేందుకు వెళ్లిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మెన్‌లు హత్యకు గురయ్యారు. 
  • ఐసిస్‌తో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై గత నెలలో డిపోర్టేషన్‌కు గురైన కెన్యా యువతి అమీనా నివసించింది టోలిచౌకీ ప్రాంతంలోనే. 
  • 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు అమీర్‌పేటలోని ఓ సంస్థలో విద్యార్థులుగా ‘ముసుగు’ వేసుకున్నారు. 
  • ఇదే ఉగ్రవాద సంస్థకు చెందిన మన్సూర్‌ అస్ఘర్‌ పీర్భాయ్, ఎజాజ్‌ షేక్‌ బంజారాహిల్స్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ట్రైనింగ్‌ తీసుకుంటూ, ఆ ప్రాంతంలోనే నివసించారు.  
  • గుజరాత్‌ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌ అయిన గులాం జాఫర్‌ గులాం హుస్సేన్‌ షేక్‌ సుదీర్ఘకాలం హకీంపేటలోని ఐఏఎన్‌ కాలనీలో టైలర్‌గా ‘అజ్ఞాతవాసం’ చేస్తూ 2015లో పోలీసులకు చిక్కాడు. 
  • ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్‌ మొహియుద్దీన్‌ హబీబ్‌నగర్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన వాడు.  
  • 2015లో చిక్కిన ‘ఐసిస్‌ త్రయం’లో ఒకడైన మాజ్‌ హసన్‌ హుమాయున్‌నగర్‌కు చెందిన వాడు. 

సిటీలో చిక్కిన ‘పరాయి వారు’ ఎందరో... 

  • టోలీచౌకీలోని ఈస్ట్‌ జానకీనగర్‌లో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్‌ అష్వఖ్‌ ఆలంను యూపీ ఏటీఎస్‌ అధికారులు  పట్టుకెళ్లారు.  
  • ముంబై లోకల్‌ రైళ్లల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు నవీద్‌ను మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారులు నేరేడ్‌మెట్‌లో అరెస్టు చేశారు.
  • బెంగళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితులైన అబ్దుల్‌ సత్తార్, అబ్దుల్‌ జబ్బార్‌ అత్తాపూర్‌ పరిధిలో చిక్కారు.  
  • దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మహ్మద్‌ తల్హా శ్రీ మెహదీపట్నంలో తలదాచుకున్నాడు.  
  • బీహార్‌ పోలీసులకు పట్టుబడిన అల్‌ఖైదా ఉగ్రవాది మీర్జా ఖాన్‌ అలియాస్‌ గులాం శ్రీరసూల్‌ ఖాన్‌ సిటీలోనే షెల్టర్‌ తీసుకున్నాడు.  
  • డాక్టర్‌ జలీస్‌ అన్సారీ మాడ్యుల్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది సయ్యద్‌ ముసద్ధిక్‌ వహీదుద్దీన్‌ ఖాద్రీ టోలిచౌకి ప్రాంతంలోనే నివసించాడు.  
  • కర్ణాటక పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న లష్కరేతోయిబా ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ సైతం సిటీలోనే చిక్కాడు.  
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌ పేలుళ్ల కేసులో నిందితులైన డానిష్‌ రియాజ్, అన్వర్‌ అలీ భగ్వాన్‌ చాలాకాలం నగరంలోనే తలదాచుకున్నారు.   
మరిన్ని వార్తలు