ఏమైంది?

6 Jan, 2018 10:53 IST|Sakshi
సౌమ్య తన చెల్లెలకు వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్‌

కనిగిరి:  రాజేష్‌ చెడు వ్యవసానాలే అ కుటుంబంలో చావు బజా మోగించాయి. జల్సాలకు అలవాటుపడిన రాజేష్‌ తప్పటడుగు వేయడం..జైలు పాలవ్వడం.. తల్లిదండ్రుల ఆదరణ కరువవ్వడం..ఆర్థికంగా ఆదరించే వారు లేక పోవడం.. వెరసీ తీవ్ర మానసిక క్షోభకు గురై భార్య పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందా.. అన్న అనుమానాలు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. కనిగిరికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు హనుమంతారెడ్డి, మహాలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు రాజేష్‌ (37) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వైజాగ్‌లో గురువారం ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరి స్వగ్రామం హెచ్‌ఎంపాడు మండలం పెదగోగులపల్లి. తండ్రి హనుమంతారెడ్డి చాలకాలం దోడ్డిచింతలలో టీచర్‌గా పనిచేశారు. అనంతరం సుమారు 22 ఏళ్ల క్రితం కనిగిరి  పట్టణంలోని కొత్తపేట పెద కరణం బజార్‌లో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు.

సొంత అన్న కుమార్తెనే కిడ్నాప్‌
రాజేష్‌ ఉరఫ్‌ దేవిరెడ్డి రాజేశ్వరరెడ్డి 2016 మార్చి 31న అన్న దేవిరెడ్డి శ్రీను (టీచర్‌) రెండో కుమార్తె సహస్రను కనిగిరిలో పట్టపగలు కిడ్నాప్‌ చేశాడు. నిందితుడు రాజేష్‌ను పోలీసులు విజయవాడలో అరెస్టు చేశారు. రాజేష్‌ చెర నుంచి పాపను క్షేమంగా కాపాడారు. ఈమేరకు అతడిపై కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదై  ఉంది.   ఐటీఐ చదివిన రాజేష్‌ జల్సాలకు అలవాటు పడ్డాడు. కనిగిరిలో రెండు మూడు వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఓ టెలికాం సంస్థలో నెల్లూరులో కొన్ని రోజులు సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సంసారాన్ని విజయవాడకు మార్చాడు. రెండేళ్లు అక్కడే ఉన్నాడు. మళ్లీ అక్కడ ఉద్యోగం వదిలి ఖాళీగా తిరుగుతూ విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. దానికి తోడు కుటుంబ సభ్యుల ఆదరణ లేదు.    తల్లిదండ్రులు అన్న కుటుంబంతోనే సన్నిహితంగా ఉంటున్నారు.

దీంతో అన్న శ్రీను కుంటుంబంపై ద్వేషం పెంచుకున్నాడు. నగదు కోసం అన్న కూతురు సహస్రను కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో కేవలం ఆర్థిక సమస్యల కారణంగా, ఆస్తి పంపకాలు చేయడం లేదనే తాను పాపను కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులకు రాజేష్‌ వెల్లడించాడు. అప్పట్లో పెద్ద మనుషుల సమక్షంలో రాజేష్‌కు తల్లిదండ్రులు కొంతమేర ఆర్థిక సర్దుబాటు చేసినట్లు తెలిసింది. కొంత కాలంగా వైజాగ్‌లో ఉంటున్న రాజేష్‌ ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లినట్లు సమాచారం. తండ్రితో మాట్లాడని రాజేష్‌ తల్లితోనే ఎక్కువగా మాట్లేవాడని తెలిసింది.  

పాపం చిన్నారులు
రాజేష్‌ తప్పులు చేసినా అభం శుభం తెలియని చిన్నారులు విష్ణు, జాహ్నవిలను విషమిచ్చి చంపడంపై కనిగిరి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు వారేం చేశారంటూ బంధువులు కలత చెందారు. ఆస్తి పంపకాలు చేసి ఉంటే ఇంత అఘాయిత్యం జరిగి ఉండేది కాదమోనని చర్చించుకుంటున్నారు. రాజేష్‌ ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరి క్షణంలో రాసిన సూసైడ్‌ నోట్‌లో ఏముందనే దానిపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

వైజాగ్‌ వెళ్లని తల్లిదండ్రులు
తల్లిదండ్రులు హనుమంతారెడ్డి, ఆదిలక్ష్మమ్మలు కుమారుడు, కోడలు, మనవళ్ల శవ పంచనామాకు వైజాగ్‌ వెళ్లలేదు. రాజేష్‌ అన్న శ్రీనివాసులురెడ్డి మాత్రమే వెళ్లాడు. తాము పూర్తి అనారోగ్యంగా ఉన్నామని, కాళ్లూ చేతులు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నందున శవపంచనామాకు వెళ్లలేక పోతున్నట్లు కనిగిరి పోలీసులకు వారు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. నలుగురి మృతదేహాలను శనివారం కనిగిరి తీసుకు రానున్నట్లు మృతుడి తండ్రి హనుమంతారెడ్డి తెలిపారు. మనుమరాలి కిడ్నాప్‌ ఘటన జరిగినప్పటి నుంచి రెండో కొడుకు రాజేష్‌ తనతో ఎప్పుడూ మాట్లాడలేదని.. అప్పుడప్పుడూ వచ్చి తల్లితో మాత్రమే మాట్లాడేవాడని చెప్పారు. 

వేదన తీరనిది..
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలో ఆరిలోవలో గురువారం జరిగిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యల వెనుక కుటుంబ గొడవలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల సమాచారంతో శుక్రవారం చెన్నై నుంచి సౌమ్య తల్లిదండ్రులు గురుస్వామి, భాగ్యలక్ష్మి, బంధువులు విశాఖ చేరుకున్నారు. ముందుగా ఆరిలోవ పోలీసులను కలిసి జరిగిన విషయం తెలుసుకున్నారు. అక్కడి నుంచి వారు కేజీహెచ్‌ మార్చురీకి చేరుకున్నారు. మార్చురీలో మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజేష్‌ మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినా శుక్రవారం రాత్రి వరకూ ఎవరూ రాలేదు. రాజేష్‌ మృతదేహానికి సంబంధించి పోస్టుమార్టం చేసేందుకు శవ పంచనామా జరగలేదు. శుక్రవారం, శనివారం రాజేష్‌ బంధువులు వస్తేనేగానీ ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరగదు.

దంపతుల మధ్య తగాదాలు లేవు
సౌమ్య, రాజేష్‌ మధ్య ఎటువంటి తగదాలు లేవు. 2010లో వివాహమైంది. రాజేష్‌ అప్పట్లో సిగ్నల్‌ టవర్స్‌లో పనిచేసేవాడు. అల్లుడు మంచోడు. అల్లుడు తల్లిదండ్రులు, అల్లుడు అన్నయ్య మధ్య కొంతకాలంగా వైరం నడుస్తోంది. బుధవారం రాత్రి సౌమ్య ఫోన్‌ చేసి అమ్మా అన్నం తిన్నావా.. అని అడిగింది. అప్పుడు కూడా నాతో ఏమీ చెప్పలేదు. బాగానే మాట్లాడింది. – భాగ్యలక్ష్మి, సౌమ్య తలి

ఎప్పుడూ అలా మాట్లాడలేదు
కుమార్తె గురుబాల (సౌమ్య) చాలా మంచిది. నాన్న నీవు మమ్మల్ని చాలా ఆదుకున్నావు. నిన్ను ఇక బాధపెట్టలేనని రెండు రోజుల కిందట ఫోన్లో చెప్పింది. అమ్మాయి నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడేది కాదు. అలాంటిది ఇలా చెప్పడంతో కొంత ఉద్వేగానికి గురయ్యా. కుటుంబమంతా ఇలా చనిపోవడానికి కారణమేంటో తెలియడం లేదు. కుమార్తె రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రకారం విచారణ చేపట్టాలి.
– గురుస్వామి, సౌమ్య తండ్రి

మరిన్ని వార్తలు