అవి తిన్నందువల్లే మారుతీరావు మృతి..!

9 Mar, 2020 11:17 IST|Sakshi

సాక్షి, మిర్యాలగూడ: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరునగరు మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక ప్రాథమిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (నిందితుడు, బాధితుడు మారుతీరావే)

కాగా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాం నుంచి ఫోరెన్సిక్‌ వైద్యులు విస్రా శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు.. బలవన్మరణానికి పాల్పడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్‌ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్‌ 28న బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగించాడు. అయినా ఆమె నుంచి సానుకూల స్పందన రాలేదు.(మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?)

ఇందుకు తోడు కోర్టు కేసు, ఆస్తి పంపకాలు, కూతురి కులాంతర వివాహం కారణంగా వేధింపులు తదితర ఒత్తిళ్ల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోమవారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో.. ఆయనను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఓవైపు కూతురు దూరమై.. ఇప్పుడు భర్త కూడా శాశ్వతంగా తనను వదిలిపోవడంతో మారుతీరావు భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.(మారుతీరావు ఆత్మహత్య!)

మరిన్ని వార్తలు