యాంకర్‌ ప్రదీప్‌ ; నీతులుచెప్పి.. గోతిలోపడి..!

2 Jan, 2018 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘మద్యం సేవించి వాహనం నడుపరాదు’ .. రోడ్డుమీద అడుగుతీసి అడుగేస్తే ఈ సందేశం కనిపిస్తూఉంటుంది. అయినాసరే కొందరు అస్సలు పట్టించుకోరు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి అమాయకులను చంపేసిన ఘటనలు కోకొల్లలు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో 2,499 కేసులు నమోదయిన దరిమిలా డ్రంకెన్‌డ్రైవ్‌పై అవగాహన మరోసారి చర్చనీయాంశమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. వేలమందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఖరీదైనకార్లతో నగరంలోని పోలీస్‌ స్టేషన్లన్నీ షోరూమ్‌లను తలదన్నాయి. ఆయా కేసులు మంగళవారం కోర్టుల్లో విచారణకు రానున్నాయి.

ప్రదీప్‌ వీడియో వైరల్‌ : మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినవారిలో టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్‌ కారును ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ (బీఏసీ) 178గా నమోదైంది. సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు. దీంతో పోలీసులు ప్రదీప్‌ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. కాగా, డ్రంకెన్‌డ్రైవ్‌, ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌పై ప్రదీప్‌ గతంలో చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘నీతులు చెప్పినవారే గోతిలో పడ్డారు’ తరహా శీర్శికలతో ప్రదీప్‌ వీడియో విపరీతంగా షేర్‌ అవుతోంది. మరికొద్ది సేపట్లో ప్రదీప్‌.. నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.

యాంకర్‌ ప్రదీప్‌ ; నీతులుచెప్పి.. గోతిలోపడి..!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా