వాట్సప్‌ చాటింగ్‌తో చీటింగ్‌

11 Sep, 2018 13:44 IST|Sakshi

మోసపోయిన మహిళ

భవానీపురం పోలీసులకు ఫిర్యాదు

భవానీపురం (విజయవాడ పశ్చిమం): వాట్సప్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆ తరువాత చాటింగ్‌తో సన్నిహితమై చివరికి చీటింగ్‌ చేసిన ఘటనపై సోమవారం భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు భవానీపురంలోని అట్కిన్‌సన్‌ స్కూల్‌ ప్రాంతంలో నాగేంద్రకుమార్, ప్రత్యూష దంపతులు నివసిస్తున్నారు. టీవీ సీరియల్స్‌లో నటించే రవికృష్ణ అనే వ్యక్తి ప్రత్యూషకు వాట్సప్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రతి రోజూ చాటింగ్‌ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన రవికృష్ణ ఆమెకు ఫోన్‌చేసి తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోక హాస్పటల్‌లో ఉన్నాడు కొంత డబ్బు కావాలని అడిగాడు. దీంతో ప్రత్యూష పోలిశెట్టి కసి అనే వ్యక్తి ఎకౌంట్‌లో రూ.10 వేలు జమ చేసింది.  ఈ నెల 3వ తేదీన రవికృష్ణ మళ్లీ ఫోన్‌చేసి మరో రూ.10 వేలు కావాల్సి వచ్చిందని అడిగాడు. ఈ సారి కోన శివ అనే వ్యక్తి ఎకౌంట్‌లో డబ్బు వేయమని చెప్పటంతో ఆమె వేసింది. తిరిగి 4వ తేదీన ఫోన్‌ చేసి అర్జంట్‌గా రూ.30 వేలు కావాలి, మొత్తం రూ.50 వేలు త్వరలోనే పంపిస్తానని చెప్పాడు. అంత మొత్తం తన వద్ద లేవని ప్రత్యూష చెప్పటంతో నువ్వు నాతో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్‌ చేసిన మెసేజ్‌లు తన వద్ద ఉన్నాయని వాటిని బయటపెడతానని ఆమెను బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన ఆమె భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మోహన్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు