వైట్నర్‌ మత్తులో మహిళల హల్‌చల్‌ 

6 May, 2019 09:45 IST|Sakshi

12 ఏళ్ల బాలిక కిడ్నాప్‌..పోలీసులపై దుర్భాషలు  

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్‌కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్‌ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ వద్ద శనివారం రాత్రి నలుగురు మహిళలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి యత్నించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షబానా, పర్వీనా, జబానా, అయేషాలు వైట్నర్‌ సేవనానికి బానిసలయ్యారు.

ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరు మదీనా కాలనీ, ఫలక్‌నుమా జైతున్‌ హోటల్, ఇంజన్‌బౌలి ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్‌ను అడ్డగించడం.. చెప్పులు విసరడం.. బూతులు తిట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై రెండు మూడు రోజులుగా 100 డయల్‌కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు ఎస్సైలు రమేష్‌ నాయక్, గొకారీ నేతృత్వంలో వైట్నర్‌లపై శనివారం ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు.

ఫాతిమా నగర్‌కు చెందిన గోరీ బీ అనే మహిళ శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన 12 ఏళ్ల చిన్న కూతురు సభా బేగాన్ని వైట్నర్‌ సేవించిన నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఇంట్లోనీ వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ‘నీ పెద్ద కుమార్తె ముంతాజ్‌ బేగం తన భర్త హాజీతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నీ పెద్ద కుమార్తె వస్తేనే చిన్న కుమార్తె సభా బేగాన్ని విడిచి పెడతామంటూ పర్వీనా అనే మహిళ బెదిరించి మిగిలిన ముగ్గురితో కలిసి తీసుకెళ్లిందని’ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు మహిళలు నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లి బాలికను వారి చెర నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఇదే సమయంలో నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసిన గోరీ బీని పోలీసుల సమక్షంలోనే కొట్టడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి స్థితిని గమనించి పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటికి వంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళలు పోలీసులను దుర్భాషలాడుతూ.. చెప్పులు విసరసాగారు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనదారులకు ఆటంకం కల్పించారు. మహిళా పోలీసులు వారిని పట్టుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిడ్నాప్, న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   

మరిన్ని వార్తలు