శ్రీదేవి కేసు; దుబాయ్‌ అధికారుల తప్పిదాలు!

28 Feb, 2018 09:34 IST|Sakshi
శ్రీదేవి డెత్‌, ఎంబామింగ్‌ సర్టిఫికేట్లు (ఇన్‌సెట్‌లో ఆమె పార్థివదేహం)

సాక్షి, వెబ్‌డెస్క్‌ : యావత్‌ భారతావని అతిలోక సుందరిగా ఆరాధించే శ్రీదేవి అకాల మరణంపై దుబాయ్‌ అధికారుల వరుస తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను బసచేసిన జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో ఫిబ్రవరి 24 రాత్రి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయారని అక్కడి పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రాసిక్యూటర్‌లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు జారీ అయిన డెత్‌, ఎంబామింగ్‌ సర్టిఫికేట్లలో మృతురాలి వివరాలను ఒక్కోచోట ఒక్కోలా పేర్కొనడం గమనార్హం. గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్‌ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదన్న విషయం తెలిసిందే. మరి అంత పకడ్బందీగా సాగే వ్యవహారాల్లో తప్పులు చోటుచేసుకోవడం, అదికూడా శ్రీదేవి లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ విషయంలో జరుగడం అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి.

శ్రీదేవి వయసెంత?
శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌ అలియాస్‌ శ్రీదేవి 1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించారన్నది నిర్వివాదాంశం. ఆ ప్రకారం చనిపోయేనాటికి ఆమె వయసు 54 ఏళ్లపైమాటే. కానీ యూఏఈ ఆరోగ్య శాఖ జారీచేసిన డెత్‌ సర్టిఫికేట్‌లో శ్రీదేవి వయసు 53 ఏళ్లుగా పేర్కొన్నారు. అదే ఎంబామింగ్‌ ప్రక్రియకు సంబంధించి అదే శాఖ జారీ చేసిన మరో ఆదేశాల్లో మృతురాలి వయసును 52 ఏళ్లని రాశారు. అందరికీ తెలిసినట్లు ఆమె వయసు 54 ఏళ్లు కాకుండా పాస్‌పోర్టులో మరోలా ఉందనుకున్నా, రెండు సర్టిఫికేట్లలోనూ దానినే పేర్కొనాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోచోట ఒక్కోలా వయసును పేర్కొనడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పటికే నటి మరణంపై కొన్ని అనుమానాలు తలెత్తిన దరిమిలా దీనిపై దుబాయ్‌ అధికారులు వివరణ ఇస్తారా లేదా అన్నది తేలాల్సిఉంది.

ఫిబ్రవరి 27న యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎంబామింగ్‌ సర్టిఫికేట్‌ ఇది(వయసు52గా పేర్కొన్నారు)

ఆ మూడురోజులూ శ్రీదేవి మృతదేహం అక్కడే..
యూఏఈ ఆరోగ్య శాఖ భవనంలో పోస్ట్‌మార్టం అనంతరం భారత కార్మికుల మృతదేహాలను ఎక్కడైతే భద్రపరుస్తారో అదే చోట శ్రీదేవి మృతదేహాన్ని కూడా మూడు రోజులపాటు ఉంచారు. మంగళవారం సాయంత్రానికి దర్యాప్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్‌ చేసి విమానాశ్రయానికి తరలించారు. నిజానికి దుబాయ్‌ అధికార వర్గాలు ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయడం అరుదు. అయితే శ్రీదేవి మరణం, ఆమె భౌతికాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారనేదానిపై స్వదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యాన్ని వివరిస్తూ భారత్‌లోని యూఏఈ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం.

ఫిబ్రవరి 26న జారీ అయిన శ్రీదేవి డెత్‌ సర్టిఫికేట్‌ (వయసు 53గా రాశారు)

నేడు అంత్యక్రియలు :
శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం ముంబై లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచునున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. విల్లే పార్లేలోని సేవా జమాజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు