నాగరాజు హత్య కేసులో వీడిన మిస్టరీ

14 Dec, 2019 09:42 IST|Sakshi
నాగరాజు, హేమలత(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు భర్తను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే .. కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజు(35), హేమలత దంపతులు నగరానికి వలసవచ్చి ప్రగతినగర్‌ ప్రాంతంలో ఉంటున్నారు. గతంలో వారు స్థానిక ప్రశాంతి గోల్డెన్‌ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్‌ ఉద్యోగి వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పని చేసేవారు. ఈ క్రమంలో హేమలత వెంకటేశ్వరెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించారు.

అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలీప్‌ పారిశ్రామికవాడ ప్రాంతానికి మాకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. తమ వివాహేతర సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించిన హేమలత, వెంకటేశ్వరరెడ్డి అతడిని హత్య చేయాలని పథకం పన్నారు. ఈ నేపథ్యంలో అతడు తినే ఆహారంలో విషం కలపాలని సూచించిన వెంకటేశ్వరరెడ్డి రెండుసార్లు హేమలతకు విషం తెచ్చి ఇచ్చాడు. అయితే ఆమె ధైర్యం చేయలేకపోయింది. దీంతో అతడిని హత్య చేసేందుకు బీదర్, వాడిచెల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన మాపన్న అనే వ్యక్తి రూ.లక్షకు సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 10న నాగరాజును బీదర్‌ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డి మాపన్నతో అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహంపై టర్పెంటాయిల్‌ పోసి నిప్పంటించారు. అనంతరం ఈ విషయాన్ని హేమలతకు చెప్పడంతో ఆమె తనకు ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమలత, వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. 

హేమలత పేరున ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌..
హేమలతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకటేశ్వరెడ్డికి ఆమెకు ప్రగతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో  ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలిసింది. 

సంఘటనా స్థలానికి నిందితులు..
నిందితులు వెంకటేశ్వరెడ్డి, మాపన్నలను సీఐ జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఏ విధంగా హత్య చేశారు. ఎక్కడి నుంచి  ఎక్కడికి వెళ్లారనే దానిపై వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు