మోసం చేసిన భార్యాభర్త అరెస్టు

28 Feb, 2020 13:03 IST|Sakshi
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐ రామచంద్రారెడ్డి

202 గ్రాముల బంగారం రికవరీ

మీడియాకు వివరాలను వెల్లడించిన సీఐ రామచంద్రారెడ్డి

చిత్తూరు, చంద్రగిరి:  స్థానికులతో నమ్మకంగా ఉంటూ మాయమాటలు చెప్పి సుమారు రూ.30లక్షల కు పైగా మోసం చేసి పారిపోయిన భార్యాభర్తలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి రెడ్డివీధికి చెందిన రవినాయుడు ట్రావెల్స్‌ నిర్వహిస్తుండగా, ఆయన భార్య సుజనాదేవి పాతపేటలోని మణప్పురం బంగారు తనఖా సంస్థలో పనిచేస్తుండేవారు. స్థానికంగా ఇరుగుపొరుగు వాళ్ల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేయడంతోపాటు బంగారు నగలు తీసుకుని తాకట్టు పెట్టడం, విక్రయించడం వంటి వ్యవహారాల్లో మోసాలకు పాల్పడ్డారు.

గత నెలలో వారిద్దరూ కనిపించకుండా పోవడంతో దిగువవీధికి చెందిన బాధితురాలు ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమెతో పాటు మరికొంత మంది బాధితుల పేర్లను చేర్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. వారిద్దరూ పాతపేటలోని రవినాయుడి సోదరుడి ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రాణం లక్ష్మి వద్ద 256 గ్రాముల బంగారం తీసుకుని తన తల్లి మీనకుమారి, స్నేహితురాలు పుష్ప పేరిట మణప్పురంలో తాకట్టు పెట్టినట్లు నిందితురాలు సుజనాదేవి పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇందులో 54 గ్రాముల బంగారాన్ని విక్రయించినట్లు తెలిపింది.

అనంతరం పోలీసులు మణప్పురం సంస్థ నుంచి సుజనాదేవి తాకట్టు పెట్టిన 202 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు అందిన మేరకు సుమారు రూ.30లక్షల వరకు వీరిద్దరూ అప్పులు చేసినట్లు తెలిసిందన్నారు. మరోమారు రిమాండ్‌ నుంచి విచారణకు తీసుకుని పూర్తి స్థాయిలో వివరాలను రాబడతామని ఆయన తెలిపారు. నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎస్‌ఐ గుర్రప్ప, పీసీలు గిరిబాబు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు