పిల్లలు లేరని భార్య.. తట్టుకోలేక భర్త

1 Sep, 2018 15:36 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీ సరస్వతి, భర్త ప్రసాద్‌

మనస్తాపంతో సీతారామపురంలో భార్య–భర్త ఆత్మహత్య 

భర్త స్టీల్‌ ప్లాంట్‌ భద్రతాదళ ఉద్యోగి, భార్య ప్రైవేటు స్కూల్‌ టీచర్‌

డీన్‌ వేధిస్తున్నాడంటూ భార్య సూసైడ్‌ నోట్‌ 

అనుమానాస్పద కేసుగా నమోదు

జగ్గయ్యపేట అర్బన్‌: తమకు పిల్లలు పుట్టడం లేదని మనస్థాపం చెందిన భార్యాభర్త వేర్వేరుగా ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా సీతా రామపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కటోజు ప్రసాద్‌ (45), భార్య లక్ష్మీ సరస్వతి (36) రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్‌ ఏపీ ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా స్థానిక విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో (జగ్గయ్యపేట బ్రాంచ్‌) ఉద్యోగం చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సరస్వతి పేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌ (శ్రీచైతన్య)లో టీచర్‌గా పనిచేస్తోంది.

అయితే పెళ్లయి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ తమకు సంతానం కలగడం లేదని లక్ష్మీ కొంత కాలంగా మనస్థాపానికి గురవుతోంది. దీంతో భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం స్కూల్‌ నుంచి వచ్చిన సరస్వతీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. విషయం తెలుసుకున్న భర్త ప్రసాద్‌ డ్యూటీ నుంచి వచ్చి స్థానికుల సహా యంతో ఆమెను బయటకు తీసేటప్పటికి అప్పటికే మృతిచెందింది. దీంతో భార్య మృతిని జీర్ణించుకోలేని ప్రసాద్‌ తీవ్ర మనస్థాపానికి గురై వెంటనే ప్రక్కన ఉన్న గదిలోకి వెళ్లి తాను కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్‌ఐ జి.శ్రీహరిబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద ఆత్మహత్యలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

స్కూల్‌ డీన్‌ వేధిస్తున్నాడని సూసైడ్‌ నోట్‌!
తమకు పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్యకు పాల్పడటం, భార్య మృతిని తట్టుకోలేక భర్త ప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అందరూ భావించారు. కాగా సరస్వతి రాసిన సూసైడ్‌ నోట్‌ బయట పడటంతో కేసు మలుపు తిరిగింది.  పోలీసులకు దొరికిన సూసైడ్‌ నోట్‌లో తనను స్కూల్‌లో డీన్‌ కృష్ణ తరచూ వేధిస్తున్నాడని, ఈ విషయాన్ని తన భర్తకు చెపితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడని సరస్వతి తల్లిదండ్రులను ప్రాధేయపడుతూ పేర్కొంది. దీనిపై శ్రీచైతన్య స్కూల్‌ డీన్‌ను పోలీసులు ప్రశ్నించగా తనకు ఏ పాపం తెలియదంటున్నాడు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

>
మరిన్ని వార్తలు