ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..

15 Jul, 2020 08:21 IST|Sakshi
చెన్నయ్య(ఫైల్‌)

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన  

మృతుడు రంగారెడ్డి జిల్లా చేగూరువాసిగా గుర్తింపు

విషయం బయటపడటంతో ఆత్మహత్యాయత్నం చేసిన నిందితురాలు

అనంతగిరి: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన అనంతగిరి గుట్ట అడవిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులో చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన చెన్నయ్య(38), శశికళ దంపతులు, వీరికి పిల్లలు ప్రవీణ్, పావని ఉన్నారు. అయితే, చెన్నయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, ఆయన భార్యకు వరుసకు మరిది అయ్యే రమేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన చెన్నయ్య భార్యతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఈనేపథ్యంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని శశికళ భావించి పథకం వేసింది. అయితే, మద్యానికి బానిసైన చెన్నయ్యకు అనంతగిరిలో చెట్లమందు ఇస్తారని శశికళ, రమేష్‌ నమ్మబలికారు. ఈనెల 6న అతడిని వికారాబాద్‌కు బస్సులో తీసుకొచ్చారు. మార్గంమధ్యలో కూడా చెన్నయ్యకు మద్యం తాగించారు. అనంతరం అక్కడి నుంచి అనంతగిరికి చేరుకుని పథకం ప్రకారం చెన్నయ్యకు పూటుగా మరికొంత మద్యం తాగించారు. ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత వాటర్‌ ట్యాంకు సమీపంలోని ఘాట్‌ వద్ద ఒక్కసారిగా లోయలోకి తోసేసి అతడిపై రాళ్లు వేసి చంపేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా చెట్లకొమ్మలు, మట్టితో కప్పేశారు.  

నాలుగు రోజుల క్రితం తల్లి మృతి
ఇదిలా ఉండగా చెన్నయ్య తల్లి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో  మరణించింది. ఒక్కగానొక్క కొడుకైన చెన్నయ్య కోసం సాయంత్రం వరకు ఎదురు చూసినా ఆయన జాడ లభించకపోవడంతో అదేరోజు సాయంత్రం వరకు చూసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివారం చెన్నయ్య తల్లి మూడు రోజుల కార్యక్రమం పూర్తయింది. అదేరోజు సాయంత్రం పలువురు బంధువులు చెన్నయ్య విషయమై భార్య శశికళను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అనుమానంతో రమేష్‌ను గ్రామపెద్దల సమక్షంలో నిలదీయగా అసలు విషయం బయట పెట్టాడు. గ్రామస్తులు, బంధువులు కలిసి మంగళవారం అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి వారిసాయంతో వికారాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు.  రెండుఠాణాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. వివరాలు సేకరించి, అక్కడే పంచనామా చేశారు. కాగా, విషయం వెలుగుచూడటంతో శశికళ తన స్వగ్రామంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా