ఖతం చేసి కథ అల్లి..

13 Jul, 2020 08:07 IST|Sakshi
సావిత్రిని హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఐ అశోక్‌ రెడ్డి, ఎస్సై అనిల్‌రెడ్డి   

వర్ని(బాన్సువాడ): కట్టుకున్న భార్యను అడవిలోకి తీసుకెళ్లి తండ్రి సహకారంతో చంపాడో భర్త. మృతదేహాన్ని ఒర్రెలో పడేసి, ఏమీ తెలియనట్లు భార్య కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తపై అనుమానంతో విచారించగా అసలు నిజం బయట పడింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌కు చెందిన తాడేం సావిత్రికి(28), వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన బాలరాజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. అప్పటికే బాలరాజ్‌కు పెళ్లి జరగగా భార్యతో విడిపోయాడు. సావిత్రికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. రెండో భర్తతో కుమారుడు ఉన్నాడు. భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. (అత్యాచారం.. ఆపై అశ్లీల వీడియోలు తీయాలని..)

ఈ నేపథ్యంలో సావిత్రిని బాలరాజ్‌ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు వసుంధర జని్మంచింది. ఏడాది నుంచి సావిత్రి ప్రవర్తన సరిగా లేనందున బాలరాజ్‌ నిలదీసేవాడు. ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో సావిత్రి భర్త, మామ సాయిలుపై గ్రామంలో పంచాయతీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న బాలరాజ్‌ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం బీడీల ఆకు, మొర్రి పండ్ల కోసమని ఆమెను తీసుకొని బాలరాజ్, సాయిలు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లారు. అడవిలోకి వెళ్లగానే తండ్రికొడుకులు కలిసి సావిత్రి గొంతు పిసికి చంపేశారు. (ఇట్టే దొరికిపోతారు!)

అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఒర్రెలో పడేశారు. వారం తర్వాత బాలరాజ్‌ తన భార్య కనబడడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేయగా ఆచూకీ లభించలేదు. భర్తపై అనుమానంతో విచారించగా తన తండ్రి సాయిలుతో కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని తీసుకెళ్లి హత్య చేసిన ప్రాంతాన్ని రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై అనిల్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలో పోస్టుమార్టం నిర్వహించి, నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు