కట్టుకున్నోడే కడతేర్చాడు?

13 Jul, 2019 06:17 IST|Sakshi
నిందితుని చుట్టూ తిరుగుతూ నిలబడిన పోలీస్‌ జాగిలం (ఇన్‌సెట్‌లో) నిందితునిగా పోలీసులు అనుమానిస్తున్న అంజాద్‌

వీడుతున్న వివాహిత హత్య కేసు మిస్టరీ

నిందితుని చుట్టూ చక్కర్లు కొట్టిన పోలీస్‌ జాగిలం

క్లూస్‌ టీమ్‌ సేకరించిన నిందితుల వేలి, పాదముద్రలు

సాక్షి, మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో తీవ్ర సంచలనం రేకెత్తించిన వివాహిత హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును సవాలుగా తీసుకున్న డీఎస్పీ ఎం.చిదానంద రెడ్డి, టూటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌తో పాటు చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందానికి దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. హతురాలి భర్తే ఆమెను గొంతు కోసి కడతేర్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నారని సమాచారం. స్థానిక తారకరామ సినిమా థియేటర్‌ రోడ్డు (నర్సింగ్‌ హోమ్‌ వీధి)లోని ఓ ఇంటిలో మూడవ అంతస్తులో కాపురం ఉంటున్న మౌజ్‌ షేక్‌ అంజాద్‌ భార్య ఎస్‌.తహశీన్‌ (28) గురువారం రాత్రి ఇంటిలోనే దారుణ హత్యకు గురవడం విదితమే. పోలీసులు ఈ హత్య ఛేదనకు అన్నిరకాల సాంకేతిక పద్ధతులు ఉపయోగించారు.

తెల్లవారు జామున 12.20కి చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందం హత్య జరిగిన ఇంటిలో క్షుణ్ణంగా వేలిముద్రలు సేకరించారు. అనంతరం పోలీస్‌ జాగిలం తహశీన్‌ మృతదేహం వద్ద వాసన చూసి అక్కడి నుంచి తారకరామ సినిమా థియేటర్‌ రోడ్డు, వారపు సంత వరకు పరుగులు తీసింది. అక్కడి నుంచి తిరిగి మహిళ హత్యకు గురైన ఇంటి వద్దకే చేరుకుంది. అక్కడే కొంతసేపు చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో తహశీన్‌ భర్త అంజాద్‌ అక్కడే కూర్చుని ఉండడంతో పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. క్లూస్‌ టీమ్‌ సేకరించిన వేలిముద్రలు, ఇతర ప్రాథమిక ఆధారాలతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఆధారాల మూలంగా అంజాదే నిందితుడని తేల్చినట్టు తెలియవచ్చింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 


హత్యకు గురైన తహశీన్‌ (ఫైల్‌)

కన్నీరుమున్నీరైన తహశీన్‌ తల్లిదండ్రులు
తమ కుమార్తె తహశీన్‌ దారుణ హత్యకు గురైందనే సమాచారం అందడంతో కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ ఇళ్ల నుంచి మహ్మద్, షాహీనా దంపతులు నర్సింగ్‌ హోమ్‌ వీధికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తహశీన్‌ ముగ్గురు బిడ్డలను పట్టుకుని భోరున విలపించడం పలువురినీ కంటతడి పెట్టించింది. షాహీనా ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

అంజాద్‌ క్షుద్రపూజలు చేసేవాడా..?
హతురాలు తహశీన్‌ భర్త అంజాద్‌ పట్టణంలోని పలు మసీదుల్లో మౌజ్‌గా పనిచేయడమే కాకుండా క్షుద్ర పూజలు చేసేవాడని ప్రచారంలోకి వచ్చింది. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంజాద్‌ ఇంటికి రకరకాల కొత్త వ్యక్తులు వచ్చేవారనీ క్షుద్రపూజలు తన ఇంటిలోనే కాకుండా అవసరమైతే పిలిచిన వారి ఇళ్లకు కూడా వెళ్లి చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మతి చలించిన అంజాద్‌ భార్యను కిరాతకంగా హతమార్చాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు