గ్రీన్‌కార్డు కోసం పెళ్లి చేసుకొని..

26 Mar, 2018 09:30 IST|Sakshi
సందీప్, అనుపమ (ఫైల్‌)

వేలూరు (తమిళనాడు): స్విట్జర్లాండ్‌ దేశంలో గ్రీన్‌కార్డు పొందేందుకు వివాహం చేసుకొని మోసం చేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని భార్య ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బెంగుళూరుకు చెందిన అనుపమ(29) తల్లితో కలిసి వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన వేదనను వెల్లడించింది. వేలూరు మాసిలామణి వీధికి చెందిన డెన్నీసన్‌ కుమారుడు సందీప్‌తో తనకు 2012లో వేలూరులోని చర్చిలో వివాహం జరిగిందని తెలిపింది. వివాహం జరిగిన తరువాత ఐదు రోజులు మాత్రమే తనతో గడిపాడని అనంతరం సందీప్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయాడని వెల్లడించింది. ఆరు నెలల్లో వీసా తీసుకొని తనను తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొంది.

అప్పటి నుంచి తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సందీప్‌ తల్లిదండ్రుల వద్ద ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పడం లేదన్నారు. స్విట్జర్లాండ్‌ గ్రీన్‌కార్డు కోసమే తనను పెళ్లిచేసుకున్నాడని బంధువుల ద్వారా తెలిసిందని, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడని వాపోయింది. అయితే 2016లో సందీప్‌ వేలూరుకు వచ్చిన సమయంలో పోలీసులు విచారణ జరపగా తాను రెండు నెలల సెలవులో వచ్చానని, మరో రెండు నెలల్లో తనను తీసుకెళతానని చెప్పి రాత పూర్వకంగా రాసి ఇచ్చి వెళ్లాడని, తరువాత ఎలాంటి ఫోన్‌ కూడా చేయలేదని వాపోయింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు