మరణంలోనూ వీడని బంధం

25 Jan, 2020 13:08 IST|Sakshi
బాలసత్యనారాయణ, మహాలక్ష్మి దంపతులు (ఫైల్‌)

ఉదయం భర్త మృతి  

ఆ వేదనతో గంటల వ్యవధిలో భార్యా కన్నుమూత   

గిద్దలూరులో విషాదం

నందనమారెళ్లలోనూ ఒకరి తరువాత మరొకరు తుదిశ్వాస విడిచిన వృద్ధ దంపతులు  

ప్రకాశం, గిద్దలూరు: ముప్పై మూడేళ్ల వైవాహిక జీవితంలో ఆ ఆలూమగలు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. అకస్మాత్తుగా భర్త మరణించడంతో దాన్ని జీర్ణించుకోలేని భార్యా గుండెలవిసేలా రోదిస్తూ..చివరకు తుదిశ్వాస విడిచింది. గిద్దలూరు పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కొప్పువారి వీధిలో నివాసం ఉంటున్న మునగనూరి బాలసత్యనారాయణ (58) కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం వీరన్నబావి వద్ద షటిల్‌ కోర్టులో షటిల్‌ ఆడుతూ కుప్పకూలాడు. దీంతో సహచరులు స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11 గంటల సమయంలో మృతిచెందాడు.

ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. భర్త మృతిని తట్టుకోలేని భార్య మహాలక్ష్మి (55) కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు. మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న బాలసత్యనారాయణకు అతని భార్య మహాలక్ష్మి దుకాణంలోనూ సహాయంగా ఉండేది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహం చేయగా..కుమారుడు రవితేజకు ఇటీవల వివాహం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలా తల్లిదండ్రులు ఇద్దరూ ఒక రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. భార్యా, భర్తలబంధానికి అర్థం చెప్పిన బాలసత్యనారాయణ, మహాలక్ష్మిల జీవితాన్ని బంధువులు కొనియాడుతూ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు వారి మృతహాలను సందర్శించి, కు టుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.

భర్త మృతదేహంతో వస్తున్నభార్య కూడా మృతి
హనుమంతునిపాడు: భర్త మృతదేహంతో వస్తూ వృద్ధురాలైన భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నందనవనంలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లింగయ్య (78) కుటుంబం కొన్నేళ్ల నుంచి విజయవాడలో ఉంటోంది. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలో లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. స్వగ్రామం నందనవనంలో  అంత్యక్రియలు చేసేందుకు బయల్దేరారు. ఈ తరుణంలో మార్గంమధ్యలో మృతుడి భార్య లింగమ్మ ఉన్నట్టుండి çస్పృహ కోల్పోయింది. చిలకలూరిపేట వద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.  దంపతుల మృతదేహాలను స్వగ్రామం తీసుకొచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. జీవితాంతం కలిసి జీవించిన దంపతులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

మరిన్ని వార్తలు