కానోడు... కావాలనుకుని.. కట్టుకున్నోడిని చంపేసింది..

16 Feb, 2019 09:06 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై (ఇన్‌సెట్‌) నిందితుడు అక్బర్‌ (ఫైల్‌)

బంధం... బంధించిందని.. అనురాగం... అపహాస్యమైందని.. ఆత్మీయత... ఆవిరైందని.. అయినోడు... అదృశ్యమవాలని.. కానోడు... కావాలనుకుని.. కాళరాత్రి... కాటేసింది.. కట్టుకున్నోడు... కన్నుమూశాడు..

వైరా: ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కారణాలు ఏమైతేనేమి, వివాహ బంధం.. తనకొక ‘బంధనం’గా మారిందని, తాను ‘బందీ’నయ్యానని ఆమె భ్రమించింది. వారి మధ్యన ఒకప్పటి అనురాగం.. ఇప్పుడు అపహాస్యమైంది. ఆత్మీయత ఆవిరైంది. అయినోడిని (భర్తను) కాటికి పంపాలనుకుంది. కానోడిని (ప్రియుడిని) కావాలనుకుంది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. (కాళ)రాత్రి వేళ... ఆ ఇద్దరూ కలిసి అతడిని చంపేశారు. ఇది, గురువారం రాత్రి ఖమ్మం జిల్లా  వైరాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు...

వైరాలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ షేక్‌ అబ్దుల్లా(30)కు, జూలూరుపాడుకు చెందిన అమీదాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సమ్రీన్‌(6), సమీరా(4) ఉన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలోనే షేక్‌ అక్బర్‌ ఉంటున్నాడు. ఇతడొక మెకానిక్‌. ఈ అక్బర్‌తో అమీదాకు కొన్నేళ్ల క్రితం పరిచయమేర్పడింది. క్రమేణా ఇద్దరూ దగ్గరయ్యారు.

రెండేళ్ల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం, ఆమె భర్త అబ్దుల్లాకు తెలిసింది. అభ్యంతరం చెప్పాడు. దీనిని ఆమె తట్టుకోలేకపోయింది. తమ మధ్య సంబంధం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు అక్బర్‌తో చెప్పింది. ఈ నెల 10వ తేదీన, ఆమె భర్త అబ్దుల్లాపై ప్రియుడు అక్బర్‌.. అకారణంగా దాడి చేశాడు. దీనిపై, పోలీస్‌ స్టేషన్‌లో అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తమ సంబంధానికి అబ్దుల్లా అడ్డుగా ఉన్నాడని అమీదా – అక్బర్‌ భావించారు, సహించలేకపోయారు. అడ్డను తొలగించాలనుకున్నారు. అబ్దుల్లాను చంపేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు.

గురువారం రాత్రి... 
అబ్దుల్లా, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్బర్‌ మద్యం మత్తులో అబ్దుల్లా ఇంటికి వచ్చాడు. అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆమె తన భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. దిండుతో అబ్దుల్లా మొహంపై అక్బర్‌ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అబ్దుల్లా మేల్కొన్నాడు. పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతడి మెడను అక్బర్‌ గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. కొద్దిసేపటికే, ఊపిరాడక అబ్దుల్లా ప్రాణాలొదిలాడు. అక్బర్‌ బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత, ‘‘నా భర్తకు ఏదో అయింది. కదలడం లేదు.. మెదలడం లేదు...’’, అని ఏడుస్తూ, చుట్టుపక్కల వాళ్లను అమీదా పిలిపిచింది.

చంపినట్టుగా ఒప్పుకున్నారు... 
పోలీసులకు సమచారం వెళ్లింది. ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ ఎ.రమాకాంత్, ఎస్సై టి.నరేష్‌ వచ్చారు. అబ్దుల్లా గొంతుపై, శరీరంపై కమిలిన గుర్తులు కనిపించాయి. అమీదాను, స్థానికుల ను విచారించారు. అక్బర్‌–అమీదా మధ్య సంబం ధం బయటపడింది. అక్బర్‌ను పిలిపించారు. ఇద్దరినీ విచారించారు. ‘‘ఔను.. మేమే చంపాం’’ అని వారిద్దరూ ఒప్పుకున్నారు(ట). అబ్దులా సోదరుడు ఫరీద్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కేసు పెడితే... బతికేవాడేమో...! 
‘‘తనపై అక్బర్‌ అకారణంగా దాడి చేశాడంటూ ఈ నెల 10న పోలీస్‌ స్టేషన్‌లో షేక్‌ అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తన భార్య అమీదాకు, అక్బర్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్లాకు, అక్బర్‌కు సర్దిచెప్పారు. దాడిలో అబ్దుల్లాకు గాయాలవడంతో, అక్బర్‌ నుంచి వెయ్యి రూపాయలను పరిహారంగా ఇప్పించి పంపించేశారు. ఆ రోజున, ఫిర్యాదు స్వీకరించి, అక్బర్‌పై చర్యలు తీసుకున్నట్టయితే... అబ్దుల్లా బతికేవాడు’’ అని, అతడి సోదరుడు, కుటుంబీకులు అంటున్నారు. ఫిర్యాదును పట్టించుకోని పోలీసుల తీరుపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా