ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

17 Jun, 2018 04:59 IST|Sakshi
భార్యాపిల్లలతో కావలి మల్లయ్య (ఫైల్‌)

     శవాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి చెరువులో వేసిన మహిళ 

     నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు నెలల క్రితం ఘటన 

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా అంతమొందించింది. అనంతరం శవాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి సిమెంట్‌ కడ్డీని సంచికి కట్టి చెరువులో పడేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన కావలి మల్లయ్య (42)కి వంగూరు మండలం కోనాపూర్‌ గ్రామానికి చెందిన పార్వతమ్మ (38)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీలత(13), కుమారుడు శ్రీకాంత్‌(16) ఉన్నారు.  

భర్త మల్లయ్య హైదరాబాద్‌లో కూలి పని చేస్తూ ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. ఇదిలాఉండగా నాగర్‌కర్నూల్‌ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మేస్త్రీ రాము(37) కుటుంబం కావలి మల్లయ్య ఇంటి పక్కనే అద్దెకు దిగారు. దీంతో రాము, ఆయన భార్య పనిచేసే చోటుకే మల్లయ్య భార్య పార్వతమ్మ కూడా వెళ్లేది. ఈ క్రమంలో రాము–పార్వ తమ్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలిసిన పార్వతమ్మ భర్త మల్లయ్య కల్వకుర్తికి వచ్చేశాడు. అయినా రాముతో తన బంధాన్ని అలాగే కొనసాగించింది. భర్తను అడ్డు తప్పిస్తే తమ సంబంధం సాఫీగా సాగుతుందనుకున్న పార్వత్వమ్మ ప్రియుడితో కలసి పథకం రచించింది. ఈ క్రమంలో గత ఏప్రిల్‌ 20న రాత్రి ఇంట్లోనే ప్రియుడు రాము, కుమారుడు శ్రీకాంత్‌ సాయంతో భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచిలో కుక్కి దానికి సిమెంట్‌ కడ్డీ కట్టి నాగనూల్‌ నాగసముద్రం చెరువులో పడేశారు. చాలా రోజులుగా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బాలమ్మ ఈ నెల 7న కల్వకుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ మరుసటి రోజే భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు పార్వతమ్మపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించారు. తరచూ పార్వతమ్మ రాముతో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా శుక్రవారం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శనివారం నాగనూల్‌ నాగ సముద్రంలో నుంచి మృతదేహన్ని బయటకు తీయించారు. నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ, కల్వకుర్తి డీఎస్పీ ఎల్‌సీ.నాయక్‌ ఆధ్వర్యంలో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు