భర్తను కడతేర్చిన భార్య

19 Mar, 2019 09:17 IST|Sakshi
హతుడి భార్య రాజేశ్వరి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) చిన్న ఆంజనేయులు మృతదేహం

సాక్షి, యల్లనూరు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన భార్య ఉదంతం యల్లనూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన డి.చిన్న ఆంజనేయులు (38) భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసముంటున్నాడు. చిన్న ఆంజనేయులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాజేశ్వరి ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. రాజేశ్వరి కొంత కాలంగా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.  

పథకం ప్రకారం హత్య 
అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడం కోసం రాజేశ్వరి తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌ అమలు చేసింది. గత శుక్రవారం రోజున చిన్న ఆంజనేయులు, రాజేశ్వరి ప్రియుడు మద్యం తాగారు. రాజేశ్వరి సూచనల ప్రకారం చిన్న ఆంజనేయులును హత్య చేసి, శవాన్ని గోనె సంచుల్లో కట్టి  సమీపంలోని చెరువు వద్ద గల చింత వనంలో పడేసి వెళ్లారు.

భర్తను వెతుకుతున్నట్లు నటించి.. 
భర్తను హత్య చేయించిన రాజేశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం సాయంత్రం రూ.500 కావాలంటూ భర్త తనతో గొడవపడ్డాడని, డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్లిపోయాడని సమీప బంధులకు చెప్పింది. అనంతరం అక్కడా, ఇక్కడా వెతకడంతో పాటు పలువురు స్వామీజీల వద్దకు వెళ్లింది. అయితే స్వామీజీల వద్దకు వెళ్లినప్పుడు నీ భర్త ఊరికి తూర్పు భాగాన వేరొక ఊరికి వెళ్లే దారిలో కుడి పక్క ఉన్నట్లు చెప్పడంతో ఆ మేరకు వెతుకుతుండగా చింత వనంలో భర్త శవమై కనిపించాడని, దీంతో గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 రాజేశ్వరిపై బంధువుల ఫిర్యాదు 
చిన్న ఆంజనేయులు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న అతని సమీప బంధువులు సోమవారం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చిన్న ఆంజనేయులు భార్య రాజేశ్వరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్న ఆంజనేయులు హత్యకు గల కారణం వివాహేతర సంబంధమేమని, భార్యే అతడి హత్యకు ప్లాన్‌ వేసిందని పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసిన నిందితులు, వారికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు