కట్టుకున్న వాడినే కడతేర్చింది

2 Dec, 2019 12:51 IST|Sakshi
నిందితులను అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్, వెనుక నిందితులు

ప్రియుడితో కలిసి  హత్య చేయించిన వైనం 

బండరాయితో మోది చంపిన నిందితులు 

36 గంటల్లో కేసును ఛేదించిన ఏలూరు పోలీసులు  

ఏలూరు టౌన్‌: వివాహేతర సంబంధం వద్దని హెచ్చరించిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ ఇల్లాలు. ప్రియుడు, అతని సహచరుడితో కలిసి పక్కా పథకం ప్రకారం అడ్డుతొలగించుకుంది. గతనెల 29న ఏలూరు శివారు దుగ్గిరాల జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద వ్యక్తి దారుణ హత్యకు గురికాగా పోలీసులు 36 గంటల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేశారు. ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్‌ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు.

 ఏలూరు తిమ్మారావుగూడేనికి చెందిన గోవాడ కృష్ణ (41) ఏలూరు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లో కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతని భార్య చనిపోగా భార్య చెల్లెలు (మరదలు)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు అక్షయ్‌ ఉన్నాడు. ఇదిలా ఉండగా మూడేళ్లుగా మనస్పర్థలతో కృష్ణ, మరియమ్మ విడిగా ఉంటున్నారు. మరియమ్మ పెదవేగి మండలం కూచింపూడిలో కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఈనేపథ్యంలో పెదవేగి మండలం అమ్మపాలెంకి చెందిన మేడంకి రాజేష్‌ అనే యువకుడితో మరియమ్మకు సెల్‌ఫోన్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన కృష్ణ వీరిద్దరినీ పలుమార్లు మందలించాడు. తమ బంధానికి అడ్డుపడుతున్నాడనే కోçపంతో కృష్ణను హతమార్చేందుకు మరియమ్మ ప్రియుడు రాజేష్‌తో కలిసి పక్కా పథకం రచించింది.

 జీతం డబ్బులు ఇస్తామని నమ్మించి.. 
రాజేష్‌ ఏలూరు ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో శార్వాణీ రెడీమిక్స్‌ ప్లాంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తుండగా ప్లాంట్‌లోనే హెల్పర్‌గా ఉన్న వట్లూరుకు చెందిన బోడ గణేష్‌కుమార్‌ అనే వ్యక్తితో కలిసి వీరు పథకం పన్నారు. మృతుడి కుమారుడు అక్షయ్‌ కూడా అదేచోట పనిచేస్తుండటంతో అక్షయ్‌కు రావాల్సిన జీతం ఇస్తామని.. దుగ్గిరాల జాతీయ రహదారి వద్దకు రావాలని కృష్ణను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన కృష్ణ ఉద్యోగ విధులు ముగించుకుని గత శుక్రవారం సాయంత్రం అక్కడకు వెళ్లాడు. ఉద్దేశపూర్వకంగా కృష్ణతో రాజేష్, గణేష్‌కు మార్‌ గొడవపడ్డారు. ఈ ఘర్షణలోనే కృష్ణను కిందపడేసి పక్కనే ఉన్న బండరాయితో తలపై బలంగా మోదారు. కృష్ణ చనిపోయాడని భావించిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ సీఐ మూర్తి వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి రక్తపుమడుగులో ఉన్న కృష్టను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఏలూరు త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి 36 గంటల్లోనే కేసును ఛేదించారు. త్రీటౌన్‌ ఎస్సై రామకోటేశ్వరరావు, పెదవేగి ఎస్సై బండి మోహనరావు, త్రీటౌన్‌ ఏఎస్సై రాంబాబు, హెచ్‌సీ రాధాకృష్ణ, పీసీ భాస్కరరావు, శ్రీనివాసరావు, సబ్‌ డివిజినల్‌ క్రైమ్‌పార్టీ సిబ్బంది ఏఎస్సై పూర్ణచంద్రరావు, హెచ్‌సీ సత్యనారాయణ, కానిస్టేబుల్‌ బాజీ, సీతయ్య తదితరులు కేసును స్వల్పకాలంలో ఛేదించి నిందితులను అరెస్టు చేయటంతో కీలకంగా వ్యవహరించారు. వీరందరినీ డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ అభినందించారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా