భర్తను కడతేర్చిన భార్య

3 Mar, 2018 10:52 IST|Sakshi
హత్యకు గురైన క్రిష్ణప్ప నిందితురాలు శాంతమ్మ

తలపై బండరాయి వేసి హత్య

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

నిందితురాలిని పట్టించిన రక్తపు చుక్క

చిత్తూరు, పలమనేరు:వేధింపులు తాళలేక భార్య భర్తను హతమార్చింది. ఆపై శవాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఓ రక్తపు చుక్క నిందితురాలిని పట్టించింది. సంచలం సృష్టించిన ఈ సంఘటన పలమనేరు మండలం పెంగరగుంట సమీపంలోని చిన్నకుంటలో శుక్రవారం జరిగింది. పలమనేరు సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. పెంగరగుంట గ్రామానికి చెందిన క్రిష్ణప్ప(55) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య శాంతమ్మ, కుమారుడు అనీల్‌కుమార్‌ ఉన్నారు. వీరు గ్రామ సమీపంలోని పొలం వద్ద నివాసం ఉంటున్నారు. క్రిష్ణప్ప మద్యానికి బానిసయ్యాడు. అతన్ని మార్చేందుకు భార్య, కుమారుడు ఎంతో ప్రయత్నించారు. ప్రయోజనం లేకపోవడంతో క్రిష్ణప్పను ఇంటికి రావద్దని చెప్పారు.

అతను బయట ఉంటూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అతను పొలం సమీపంలోని మామిడితోపు వద్ద మద్యం సేవించాడు. ఆపై మనువరాలికి చెప్పి భార్యను రమ్మన్నాడు. ఆమె అక్కడికి వచ్చి మళ్లీ తాగొచ్చావా అంటూ వాగ్వాదానికి దిగింది. ఎంతచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించింది. మత్తులో పడి ఉన్న అతనిపై బండరాయి వేసి హత మార్చింది. తర్వాత మృతదేహాన్ని సంచిలో మూటకట్టి గుడియాత్తం రోడ్డు వద్దకు ఈడ్చుకెళ్లింది. అక్కడ పడేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆ దారిలో వెళ్లేవారు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావించారు.

ఓ రక్తపు చుక్కతో
శవానికి కాస్త దూరంలో పోలీసులకు ఓ రక్తపు చుక్క కనిపించింది. దాని ఆధారంగా కొంత దూరం పరిశీలించగా మట్టిలో రక్తపు చుక్కలు కనిపించాయి. ఎవరో హత్యచేసి లాక్కొచ్చి రోడ్డులో పడేశారని గుర్తించారు. మృతుని భార్యపై అనుమానంతో విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఆమెను అదపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన బండరాయి, శవాన్ని లాక్కెళ్లిన తాడును స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా