భార్యను కడతేర్చిన భర్త      

16 May, 2018 08:52 IST|Sakshi
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ స్వామి, చిత్రంలో నిందితులు

చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

పెళ్లికి ముందే శ్రీనివాస్‌కు మరో యువతితో సంబంధం

శిరీషను వదిలించుకునేందుకు నిత్యం వరకట్న వేధింపులు

పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు  

చేవెళ్ల(రంగారెడ్డి) : వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా చీరతో ఉరివేసి  భార్యను హత్య చేశాడు ఓ కీచక భర్త. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామంలో ఈనెల 7న జరిగిన ఈ హత్యను పోలీసులు వరకట్నం వేధింపుల కేసుగా దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యను హత్యచేసి అనారోగ్యంతో మృతి చెందినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీస్‌ విచారణలో తెలింది.

ఈ కేసులో నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ స్వామి, సీఐ గురువయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్‌ అలియాస్‌ శేఖర్‌కు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన మల్లేశం, లక్ష్మీల కూతురు శిరీష అలియాస్‌ మమత (23)ను ఇచ్చి గతేడాది జూన్‌లో పెద్ద సమక్షంలో పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో వరకట్నంగా రూ.14 లక్షల వరకు కట్నకానుకలు ముట్టజెప్పారు. కొన్ని నెలల తరువాత శిరీషకు వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. శ్రీనివాస్‌ ఓడీఎఫ్‌ దగ్గర సొంతంగా మెడికల్‌ షాపు పెట్టాడు. చిన్న చెల్లెలు వివాహం నిశ్చయం కావడంతో మరో రూ. 2 లక్షల కావాలని భార్య శిరీషను నిత్యం అత్తింటివారు వేధింపులకు గురిచేసేవారు.

కట్నం విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగి శిరీష పుటింటికి వెళ్లింది. కాగా గర్భవతి కావడంతో పెద్దలు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయినా అత్తింట్లో ఆమెకు  భర్త అత్తమామ, ఆడపడుచుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.   

కడుపునొప్పి అని నాటకం.. 

భర్త శ్రీనివాస్‌కు గ్రామంలోనే మరో యువతితో పెళ్లికి ముందే పరిచయం ఉంది. వారి పరిచయం వివాహేతర సంబంధంగా  మారింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసినా బయటకు రాకుండా శిరీషతో పెళ్లి చేశారు. పెళ్లైన తరువాత కూడా  ఆ యువతితో శ్రీనివాస్‌ సంబంధం కొనసాగుతూనే ఉంది. వేరొకరి మోజులో పడి అదనపు కట్నం తీసుకురావాలని చెప్పినా  తీసుకురాకపోవడంతో ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని శ్రీనివాస్‌ నిర్ణయించకున్నాడు.

ఈ నెల 6వ తేదీ రాత్రి భార్యతో గొడవపడ్డాడు. భార్య గర్భిణి అని కూడా చూడకుండా కడుపులో తన్నడంతో తీవ్ర రక్తస్రావమైంది. తెల్లవారు జామున  మూడు గంటల సమయంలో చీరతో ఉరివేసి శిరీషను చంపి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తనపై అనుమానం రాకుండా ఉండాలని ఇరుగుపొరుగు వారికి తన భార్యకు కడుపునొప్పి వచ్చిందని చెప్పి మొయినాబాద్‌ మండలంలోని భాస్కర ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పటంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడు అత్తామామలకు శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి శిరీష కడుపునొప్పితో బాధపడుతున్నట్లు బొంకాడు. వారు వచ్చే లోపు ఆమె చనిపోయినట్లు చిత్రీకరించారు.  

శరీరంపై గాయాలతో అనుమానం.. 

కుటుంబసభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలు గుర్తులతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన గొడవలు కూడా ఉండడంతో అత్తింటివారే కట్నం కోసం వేధించి చంపేశారని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో భర్త శ్రీనివాస్, అత్తామామలు కాంతమ్మ, శ్రీశైలం,  ఆడపడుచులు మంగమ్మ, శారద, అనిత, శ్రీనివాస్‌ ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది.

విచారణలో భర్త శ్రీనివాస్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.    

మరిన్ని వార్తలు