అడ్డొస్తున్నాడని మట్టుబెట్టారు

7 Aug, 2018 10:53 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సీతారాం  

వివాహేతర సంబంధం..

ప్రియుడితో కలిసి భర్తను  హత్య చేయించిన భార్య

ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే కేసు కొలిక్కి

జిన్నారం(పటాన్‌చెరు) : అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను ఓ భార్య హత్య చేయించింది. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిన్నారం సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రాపుం డీఎస్పీ సీతారాం వెల్లడించారు. గాజులరామారం గ్రామానికి చెందిన పరిమాళ్ల వెంకటేశ్‌(34)కు గుమ్మడిదల మండలం మంబాపూర్‌ గ్రామానికి చెందిన మల్లెపల్లి మహిమలతో 2011లో వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మొదట్లో భార్యభర్తలు గాజులరామారంలో నివాసం ఉండేవారు. ఇదిలా ఉండగా, వెంకటేశ్‌ తరచూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండటంతో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న మహిమల ప్రోద్భలంతో దోమడుగు గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉంటున్న మద్ది మల్లారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో వీరు అద్దెకు దిగారు. మల్లారెడ్డి ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా.. వెంకటేశ్‌ కూడా అదే పరిశ్రమలో పనిలో చేరాడు.

ఈక్రమంలో కొంతకాలంగా వెంకటేశ్‌తో స్నేహం పెంచుకున్న మల్లారెడ్డి తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అక్రమంలో మహిమలతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. మల్లారెడ్డి తరచూ ఇంటికి రావడాన్ని తెలుసుకున్న వెంకటేశ్‌ తన భార్యను కట్టడి చేశాడు. ఈక్రమంలో మల్లారెడ్డికి చెప్పి భర్తను అంతమొందించాలని సూచించింది.

దీంతో జనవరి 18న మల్లారెడ్డి తన స్నేహితుడైన మహేశ్‌తో కలిసి వెంకటేశ్‌కు మద్యం తాగించారు. కారులో వెంకటేశ్‌ను తీసుకెళ్లి నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట ఫారెస్ట్‌ ప్రాంతంలో వెంకటేశ్‌ను గుంతునులిమి..ఆపై ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 

అద్దె ఇంట్లో నివాసం

వెంకటేశ్‌ను హత్య చేసిన అనంతరం మల్లారెడ్డి, మహిమల నర్సాపూర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇలా ఐదు నెలలు ఉన్నారు. ఇదిలా ఉండగా, నెల రోజులుగా మల్లారెడ్డి నర్సాపూర్‌ వెళ్లడం మానేశాడు. మహిమల ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించ లేదు. దీంతో వెంకటేశ్‌ కనిపించడం లేదని అతని బాబాయ్‌కు మహిమల నెల రోజుల క్రితం ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. దీంతో మృతుడి బాబాయ్‌ ఈనెల 3న గుమ్మడిదల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న ఎస్సై ప్రశాంత్‌కు మహిమల తీరుపై అనుమానం వచ్చింది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టడగా.. జనవరి 19న నారాయణఖేడ్‌ పీఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తి హత్యపై కేసు నమోదై ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై మహిమలను విచారించగా తన భర్తను హత్య చేయించనట్టు ఒప్పుకుంది. దీంతో మహిమల, మల్లారెడ్డి, మహేశ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో కేసును ఛేదించిన గుమ్మడిదల ఎస్సై ప్రశాంత్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్యామల వెంకటేశ్, ఎస్సైలు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా