గొడ్డలితో నరికి.. పొలంలో పూడ్చి 

28 Sep, 2019 03:24 IST|Sakshi
ఘటనా స్థలంలో అధికారులు

భర్త చేతిలో భార్య దారుణహత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవ

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

బంట్వారం: వివాహేతర సంబంధంపై భార్యను పలుమార్లు మందలించినా మార్పులేకపోవడంతో భర్త ఆమెను గొడ్డలితో నరికి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు. కొన్ని రోజులు తప్పించుకుని తిరిగి శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం బార్వాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బార్వాద్‌కు చెందిన ఆనందం అలియాస్‌ నందు బంట్వారం లక్ష్మి (30)ని పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. లక్ష్మి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయమై ఆమెను భర్త మందలించినా మార్పు రాలేదు. ఈనెల 24న భార్యాభర్తలు కలిసి పొలం పనులకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఆనందం భార్య లక్ష్మిని గొడ్డలితో నరికి చంపాడు. రాత్రి పొలంలోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఇంటికి వెళ్లిన అతడు పిల్లలను తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడు. అను మానంతో అతడిని బంధువులు ప్రశ్నించగా విషయం చెప్పాడు. వారి సూచన మేరకు ఆనందం ధారూరు సీఐ రాజశేఖర్‌ ఎదుట లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పొలంలో పాతి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. 

మరిన్ని వార్తలు