ప్రియుడితో కలిసి భర్త హత్య

30 Oct, 2019 07:53 IST|Sakshi

కర్ణాటక,బళ్లారి అర్బన్‌: బళ్లారి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్‌ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది.

దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్‌ఎల్‌సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం  మంగళవారం లభ్యమైంది.   సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు