భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్‌

13 Feb, 2019 17:45 IST|Sakshi
అరెస్టయిన షెన్భగవల్లి, హత్యకు గురైన కదిర్‌వేల్‌ (ఫైల్‌)

చెన్నై: భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విల్లుపురం సమీపం నన్నాడు గ్రామానికి చెందిన కదిర్‌వేల్‌ (48). ఇతను చెన్నైలో ఉంటూ ఓ ఆయిల్‌ కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఇతని భార్య షెన్భగవల్లి (40). మార్కిస్టు లెనిన్‌ కట్చి విల్లుపురం జిల్లా మహిళా కార్యదర్శిగా ఉంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ కడంబాక్కంలో ఉన్న షెన్భగవళ్లి తల్లి ఇంటిలో ఉంటూ చదువుతున్నారు. కొన్ని నెలల కిందట చెన్నై నుంచి  వచ్చిన కదిర్‌వేల్‌ తన భార్యతో విల్లుపురం సాలమేడు వీజీపీ నగర్‌లో గుడిసెలో నివసిస్తున్నారు. ఈ స్థితిలో గత 6వ తేదీ అర్ధరాత్రి వీరి గుడిసెకు మంటలు అంటుకున్నాయి.

స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఆ సమయంలో ఇంటి లోపల కదిర్‌వేల్‌ గొంతు కోసిన స్థితిలో శవంగా పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న విల్లుపురం పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటి తరువాత అక్కడికి వచ్చిన షెన్భగవల్లి వద్ద విచారణ చేశారు. ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన భర్తను హత్య చేసి ఇంటికి నిప్పు పెట్టిఉంటారని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. ఈ స్థితిలో సోమవారం షెన్భగవల్లిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది.

షెన్భగవల్లి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ‘‘ భర్త కదిర్‌వేల్‌ తరచూ మద్యం సేవించి వచ్చి అసభ్యంగా తిట్టి నాపై దాడి చేస్తూ వచ్చాడు. అతని వల్ల మనశ్శాంతి కరువైంది. గత 6వ తేదీ మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కదిర్‌వేల్‌ నాపై దాడి చేశాడు. తరువాత నిద్రపోయాడు. దీంతో ఆవేశం చెంది ఇంట్లో ఉన్న కత్తితో భర్త గొంతు కోసి హత్య చేశాను. రక్తపు మరకలు పడిన దుస్తులు, కత్తిని అక్కడ కొత్తగా నిర్మిస్తున్న కళాశాల పక్కన పడవేశాను. తరువాత హత్య నుంచి తప్పించుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేసి, ఇంటికి మంటలు పెట్టి వెళ్లినట్లుగా పోలీసులకు చెప్పినట్టు తెలిపింది.’’ దీంతో పోలీసులు షెన్భగవల్లిని సోమవారం అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు