చున్నీతో గొంతు నొక్కి హత్య

2 Aug, 2018 06:55 IST|Sakshi
భర్త శవాన్ని చూసి రోదిస్తున్న భార్య దేవి (ఫైల్‌)

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

సెల్‌ఫోన్‌ సాయంతో ఛేదించిన రంపచోడవరం పోలీసులు

తూర్పుగోదావరి, రంపచోడవరం: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే పాశవికంగా హత్య చేసిందో ఇల్లాలు.  రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరం వద్ద జరిగిన ఈ హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సీఐ బీహెచ్‌ వెంకటేశ్వరరావు, ఎస్సై జె.విజయబాబు బుధవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. వడ్డి ఇమ్మానియేల్, దేవి దంపతులు రాజమహేంద్రవరం సమీపంలోని హుకుంపేటలో నివాసం ఉండేవారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. ఇమ్మానియేల్‌ తాపీ పని చేస్తాడు. కొండ్రుతు శివ కూడా తాపీమేస్త్రీ. ఇద్దరూ కలిసి పనికి వెళ్లేవారు. దేవి పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్లే క్రమంలో ఆమెకు శివతో  పరిచయం పెరిగింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇమ్మానియేల్‌ దంపతుల మధ్య పొరపొచ్చాలొచ్చాయి.  తరచూ ప్రశ్నలతో వేధిస్తుండడంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు శివకు చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి ఎలాగైనా ఇమ్మానియేల్‌ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ వేశారు.

అమలు చేసిందిలా..
జూలై 26న రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్‌ సెంటర్‌కు రావాలని ఇమ్మానియేల్‌ను శివ కోరాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. గోకవరంలో కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత  శివ గోకవరం వెళ్లి హతుడి భార్య దేవిని ఘటనా స్థలానికి తీసుకు వచ్చాడు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్‌’ అంటూ ఇమ్మానియేల్‌  భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్‌ మద్యం మత్తులో ఉన్నాడు.  దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్‌ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. తర్వాత నిందితులిద్దరూ నరసాపురం వద్ద కొనుగోలు చేసిన పెట్రోల్‌ పోసి శవాన్ని తగలబెట్టారు.

హత్య కేసును ఛేదించింది ఇలా..
ఘటనా స్థలంలో దొరికిన హతుడి సెల్‌ఫోన్‌ హంతకులను పట్టించింది. ఆ ఫోన్‌లో సిమ్‌ కార్డు లేదు. సెండ్‌ ఐటమ్స్‌లో ఒక్క నెంబరు  ఉండడంతో, ఆ నంబర్‌కు పోలీసులు ఫోన్‌ చేశారు. పశ్చిమ గోదావరి పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద గుమాస్తాకు ఆ ఫోన్‌ వెళ్లడంతో పోలీసులు అతడికి విషయం చెప్పారు. ఆ గుమాస్తా హతుడి వివరాలను పోలీసులకు తెలిపారు. దీంతో బొమ్మూరు పోలీసుల సహాయంతో హత్యకు గురైన ఇమ్మానియేల్‌ ఇంటికి రంపచోడవరం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దొరికిన బ్రాందీ సీసాపై ఉన్న  లేబుల్‌ను బట్టి ఎక్సైజ్‌ శాఖ సహకారంతో ఆ మద్యం బాటిల్‌ ఎక్కడ కొనుగోలు చేశారో పోలీసులు తెలుసుకున్నారు. గోకవరం బ్రాందీ షాపులో ఆ బాటిల్‌ కొన్నట్టు తెలియడంతో అక్కడి సీసీ టీవీ పుటేజీలను వారు పరిశీలించారు. నిందితుడు, హతుడు ఇద్దరూ కలిసి మద్యం కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు  బుధవారం శివను, దేవిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

తల్లిని చూడాలనడంతో...
నిందితురాలైన దేవిని పోలీసులు అరెస్టు చేయడంతో పిల్లలు ఆమెపై బెంగ పెట్టుకున్నారు. దీంతో వారి పెద్దమ్మ పిల్లలను రంపచోడరవం పోలీస్‌ స్టేషన్‌కు బుధవారం తీసుకు వచ్చింది.

మరిన్ని వార్తలు